సెప్టెంబ‌ర్ 10వ తేదీన వినాయ‌క చ‌వితి తేదీన జియో ఫోన్ నెక్స్ట్ సేల్ ప్రారంభం కానుందని కంపెనీ జూన్ లో జ‌రిగిన వార్షిక స‌ద‌స్సులో ఘ‌నంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సేల్ ను కంపెనీ న‌వంబ‌ర్ కు వాయిదా వేసింది. కార‌ణం మాత్రం ఒక్క‌టే - సెమీకండ‌క్ట‌ర్ల కొర‌త‌.


ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ రంగం గొప్ప సవాలును ఎదుర్కొంటోంది. అదే సెమీకండక్టర్ల ప్రపంచ కొరత. దీనికి తోడు ఇది అంత త్వ‌ర‌గా అంతం అయ్యే స‌మ‌స్య‌లా కూడా కనిపించడం లేదు.


ప్రపంచంలోని అతిపెద్ద ల్యాప్‌టాప్ తయారీదారులలో ఒకటైన ఏసర్ తెలుపుతున్న దాని ప్రకారం.. కనీసం 2022 ప్ర‌థ‌మార్థం వరకు త‌యారీ కంపెనీలపై ఈ ప్రభావం ఉంటుంది.


ఎలక్ట్రానిక్ పరికరాలలో సెమీకండక్టర్‌లు ఒక ముఖ్యమైన భాగం. కార్లు, ఫ్యాక్టరీ యంత్రాల నుంచి డిష్‌వాషర్‌లు, మొబైల్ ఫోన్‌ల వరకు అన్నిటిలోనూ వీటి అవ‌స‌రం ఉంది. డివైస్ లోకి వ‌చ్చే విద్యుత్ ను నియంత్రించడానికి వీటిని ఉపయోగిస్తారు.


మొదట్లో కోవిడ్ మహమ్మారి ఫలితంగా ఈ కొర‌త‌ ప్రారంభం అయింది. చైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ ఫ్యాక్ట‌రీల్లోని సిబ్బంది క‌రోనా కార‌ణంగా పనికి వెళ్లలేకపోయారు. దీంతో ప్లాంట్‌లు మూత‌బడి ఉత్పత్తి నిలిచిపోయింది.దీంతో స‌ర‌ఫ‌రా కొర‌త ఏర్ప‌డింది. పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దులలో కఠినమైన ఆంక్షలు ఉండ‌టంతో వీటి సరఫరా కూడా మందగించింది.


అదే సమయంలో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించారు. విద్యార్థులు కూడా ఆన్ లైన్ క్లాసుల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో ఆటోమేటిక్ గా కొత్త డివైస్ ల అవ‌స‌రం చాలా పెరిగింది. దీంతో సెమీకండ‌క్ట‌ర్ ల‌కు డిమాండ్ కూడా ఎక్కువైంది.


అయితే ఈ కొర‌త‌ కేవలం ఎలక్ట్రానిక్స్ రంగంలో మాత్ర‌మే ఏర్ప‌డ‌లేదు. హెల్త్ కేర్, కాస్మొటిక్స్ నుంచి నిర్మాణం, డిఫెన్స్ వరకు సెమీకండక్టర్‌లను ఉపయోగించే ప్రతి పరిశ్రమను ఈ కొర‌త‌ ప్రభావితం చేసింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషణ ప్రకారం.. ఈ కొరత కనీసం 169 వేర్వేరు పరిశ్రమలను ప్రభావితం చేసింది.


సెమీ కండ‌క్ట‌ర్ కొరత వార్త‌లు వ‌చ్చాక‌.. వాటిని ఉపయోగించే కంపెనీలు కాస్త‌ భయానికి లోనై, వాటిని నిల్వ చేయడం ప్రారంభించాయి. దీంతో కొరత మ‌రింత పెరిగింది.


వీటి కొర‌త కార‌ణంగా ఆటోమోటివ్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఒక కారు సుమారు 30,000 భాగాలతో తయారు చేయబడింది. అసెంబ్లీ సమయంలో ఈ భాగాలలో ఒకటి అందుబాటులో లేకపోయినా సిస్టం పూర్తిగా ఆగిపోతుంది. కొత్త కార్లు త‌యారు చేయ‌డం, రవాణా చేయ‌డం అస్స‌లు కుద‌ర‌దు.


ఈ సంవత్సరం ప్రారంభంలో చిప్ కొరత ఫలితంగా జనరల్ మోటార్స్ అనే కంపెనీ కొన్ని తయారీ కేంద్రాలలో ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. దీని వలన కంపెనీకి కనీసం 2 బిలియన్ డాలర్లు(రూ.15 వేల కోట్ల‌కు పైగానే) నష్టం వాటిల్లింది.


మైక్రోచిప్ కొరత ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులపై ప‌డింది. కొత్త కారు లేదా రీప్లేస్‌మెంట్ పార్ట్స్ కొనాలనుకుంటున్న‌ కస్టమర్‌లు ఆరు నెలల వరకు వేచి ఉండాల్సి వ‌స్తుంది.


కంప్యూటర్ తయారీదారులైన‌ డెల్, హెచ్‌పీ, లెనోవో తమ ఉత్ప‌త్తుల‌ ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. టెలివిజన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి భ‌విష్య‌త్తులో కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


క‌రోనా ముందునుంచే సెమీకండక్టర్‌ల డిమాండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది, ఎందుకంటే ఉత్పత్తులు మరింత అధునాతనంగా మారాయి. 5జీ, "ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్" వంటి టెక్నాల‌జీలు మన రోజువారీ జీవితంలో భాగంగా మారుతున్నాయి. ఈ స‌మ‌స్య‌కు ఏకైక ప‌రిష్కారం సెమీకండక్టర్ల సరఫరాను పెంచడమే. చిప్ తయారీదారు ఇంటెల్ ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీని పెంచడానికి ప్రణాళికలు ప్రకటించింది. అమెరికా, యూరప్‌లో కొత్త ఫ్యాక్టరీలను కూడా తెరిచింది.


అయితే దీనికి కొంత‌ సమయం పడుతుంది. కాబట్టి వినియోగదారులపై ఈ కొరత ప్రభావం మ‌రిన్ని నెల‌ల‌పాటు ఉండే అవ‌కాశం ఉంది.


Also Read: Jio phone next: ప్రపంచంలోనే అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్.. కొనాలంటే అప్ప‌టిదాకా ఆగాల్సిందే!


Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వ‌చ్చేస్తున్నాయి.. ఈసారి మ‌రిన్ని కొత్త రంగుల్లో!


Also Read: గుడ్ న్యూస్.. ఈ బ‌డ్జెట్ రియ‌ల్ మీ ఫోన్ పై భారీ ఆఫ‌ర్.. ఏకంగా రూ.6 వేల వ‌ర‌కు!