అఫ్గానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భారతదేశంలో ఉగ్రదాడులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం అస్థిరత విదేశీ ఉగ్రవాదులందరికీ ఒక స్థావరంలా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు తమ పంజా విసురుతారని.. దీనిని నియంత్రించడం ప్రపంచదేశాలకు చాలా కష్టమని నివేదికలో వివరించింది. జిహాదీలు తమ కార్యకలాపాల కోసం దేశంలో కుల విభజన అంశాన్ని ఉపయోగించుకోవచ్చని అంచనా వేసింది. ఫలితంగా జమ్మూ కశ్మీర్ సహా బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతాయని హెచ్చరించింది. 


అతి పెద్ద సవాలుగా మారనుంది.. 
అఫ్గాన్ దేశంలో నాటో, అమెరికా దళాల ఓటమి ప్రపంచానికి పెద్ద సమస్యగా పరిణమించింది. ఇప్పటికే ఛాన్స్ కోసం వేచిచూస్తోన్న జిహాదిస్టులు ఇండియాపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. అఫ్గాన్ తాలిబన్ల వశం అయ్యాక.. భారత ఏజెన్సీల ద్వారా అంతర్గత భద్రతను ప్రముఖ మీడియా సంస్థ పరిశీలించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను నివేదిక రూపంలో వెల్లడించింది. దీని ప్రకారం జిహాద్.. ఇండియాకు అతి పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది. తిరుగుబాటుదారులు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 ట్విన్ టవర్ దాడులు జరిగి నేటికి 2 దశాబ్దాలు పూర్తి అయిన నేపథ్యంలో ఉగ్రదాడులు పెరిగే అవకాశం 400 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పింది. 


పాకిస్తాన్ తాలిబన్ బలమైన శక్తిగా మారుతోంది..
ప్రపంచవ్యాప్తంగా జిహాదిస్టులు విస్తరిస్తారని ఈ నివేదిక అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలుగా మారతారని పేర్కొంది. ఇప్పటికే గందరగోళంగా ఉన్న అఫ్గానిస్తాన్ ప్రభావం పాకిస్తాన్‌పై పడుతుందని.. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) పునరుద్ధరించబడే అవకాశం ఉందని వెల్లడించింది. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌ను పాకిస్తాన్ తాలిబన్ అని కూడా పిలుస్తారు. ఇది పష్టున్ ఇస్లామిస్ట్ సాయుధ విద్యార్థి సంఘం. ఇది అఫ్గాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వివిధ విద్యార్థి మిలిటెంట్ గ్రూపులుగా మారి ఏర్పాటుచేసిన సంస్థ. టీటీపీ ఒక ప్రధాన తీవ్రవాద సంస్థగా మారిందని.. పాకిస్తాన్ దేశంలోని అన్ని జిహాదీ గ్రూపులు (వీటి ప్రత్యర్థి గ్రూపుతో సహా) దీనిలో చేరాయని అంచనా వేసింది. 


డ్రగ్స్ స్మగ్గింగ్ రెండింతలు..
పాకిస్తాన్ తన ఉగ్రవాద గ్రూపులన్నింటినీ ఫెడరల్ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియా (FATA) ప్రాంతాల నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు మార్చడానికి ప్రయత్నిస్తుందని నివేదిక తెలిపింది. ఉగ్ర దళాల మొత్తానికి నంగర్‌హార్ ఆవాసంగా మారవచ్చని పేర్కొంది. అఫ్గానిస్తాన్ దేశంలో పాకిస్తాన్ కరెన్సీని ఎక్కువగా ఉపయోగించిన తర్వాత నార్కోటిక్స్ టెర్రరిజం తీవ్రమవుతుందని.. డ్రగ్స్ స్మగ్గింగ్ రెండింతలు అవుతుందని చెప్పింది.  


Also Read: Selfie Vide Viral: మైదుకూరు సీఐ బెదిరిస్తున్నారు... కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంటాను.... సెల్ఫీ వీడియో వైరల్


ALso Read: National Resistance Force: అఫ్గాన్ లో ఆట ఇప్పుడే మొదలైంది.. 'పంజ్‌షీర్‌'తో అంత ఈజీ కాదు!