నంద్యాలలో సలాం కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరవక ముందే ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. తన భూమి ఆక్రమించుకున్నారని పోలీసుల దగ్గరికి వెళితే వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో పెట్టారు. పోలీసులు ఎన్ కౌంటర్ కన్నా ముందే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నాడు.
వైసీపీ నేతతో భూవివాదం
కడప జిల్లా మైదుకూరు రూరల్ సీఐ, డీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ల నుండి ప్రాణహాని ఉందని అక్బర్ బాషా అనే వ్యక్తి పెట్టిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. దువ్వూరు మండలానికి చెందిన ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డితో జరుగుతున్న భూవివాదంలో మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అక్బర్ బాషా ఆరోపించారు. తనకు న్యాయం చేయక పోగా స్టేషన్ లోనే ఎన్ కౌంటర్ చేస్తానని సీఐ కొండారెడ్డి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం స్పందించాలని వినతి
కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన మిద్దె అక్బర్ బాషకు దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో దాన విక్రయం కిందట ఎకరం పొలం రిజిస్టర్ చేయించుకున్నాడు. కానీ రెండు సంవత్సరాల క్రితం జోన్నవరం రామలక్ష్మి రెడ్డి అనే వ్యక్తికి అదే పొలాన్ని అక్బర్ అత్త అమ్మడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. ఈ కేసు విత్ డ్రా చేసుకోమని సీఐ కొండారెడ్డి, ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి తమను బెదిరిస్తున్నారని అక్బర్ ఆరోపిస్తున్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కలగజేసుకుని 48 గంటల్లో తమకు న్యాయం చేయకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని అక్బర్ భాష ఇంటర్ నెట్ లో సెల్ఫీ వీడియో పెట్టారు.
చంద్రబాబు ట్వీట్
ఈ సెల్ఫీ వీడియోపై చంద్రబాబు స్పందించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దారుణ వార్త వినాల్సి వస్తోందని ఆరోపించారు. మైదుకూరులో వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందన్నారు. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని విమర్శించారు.
వారంలో పరిష్కరించాలని సీఎం ఆదేశం
కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడినట్లు సమాచారం. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రాత్రే స్పందించాం: ఎస్పీ
అంతకముందు సెల్ఫీ వీడియో చేసిన అక్బర్ బాషా కుటుంబంతో ఎస్పీ మాట్లాడారు. బాధిత కుటుంబం, కడప వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై శుక్రవారం రాత్రి 11.20 గంటలకు స్పందించామని తెలిపారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్ పిటిషన్ ఇచ్చారు. సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని ఎస్పీ తెలిపారు. సీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించామన్నారు. భూవివాదం పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చిందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
Also Read: AP Crime: కడప జిల్లాలో దారుణం.. మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ