ప్ర‌పంచంలోనే అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్ అంటూ జియో ఫోన్ నెక్స్ట్ ను కంపెనీ గ‌తంలో అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ నేటి(సెప్టెంబ‌ర్ 10వ తేదీ) నుంచి ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. జియో దీన్ని వాయిదా వేసింది.


తాజాగా విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ ప్ర‌కారం.. ఈ ఫోన్ సేల్ దీపావ‌ళి నుంచి జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్ర‌యించ‌నున్న‌ట్లు ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 


స్మార్ట్ ఫోన్ల‌లో ఉప‌యోగించే సెమీ కండ‌క్ట‌ర్ అనే ప‌రిక‌రానికి సంబంధించిన కొర‌త ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉంది. దీని కార‌ణంగానే జియో ఫోన్ నెక్స్ట్ సేల్ వాయిదా ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.


గూగుల్ భాగ‌స్వామ్యంతో జియో ఈ ఫోన్ రూపొందిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ వంటి ఫీచ‌ర్లు కూడా ఉండ‌నున్నాయి. ఈ ఫోన్ ధ‌ర కూడా గ‌తంలోనే ఆన్ లైన్ లో లీకైంది. దీని ప్ర‌కారం రూ.3,499 లేదా 50 డాల‌ర్లుగా ఉండ‌నుంది.


మ‌న‌దేశంలో ఇప్ప‌టికీ 2జీ నెట్ వ‌ర్క్ వినియోగించే ప్ర‌జ‌ల‌ను 4జీ వైపుకు మ‌ళ్లించే ల‌క్ష్యంతో ఈ ఫోన్ లాంచ్ చేయ‌నున్న‌ట్లు జియో పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన ఫోన్ల‌లో ఉన్న ప్రీమియం ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్ లో అందించ‌నున్న‌ట్లు జియో పేర్కొంది.


జియో ఫోన్ నెక్స్ట్ లో అందించ‌నున్న వాయిస్ ఫ‌స్ట్ అనే ఫీచ‌ర్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ భాష‌లో ల‌భించే కంటెంట్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్ ద్వారా గొప్ప కెమెరా అనుభ‌వాన్ని పొంద‌వ‌చ్చు. దీంతోపాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్టం, సెక్యూరిటీ అప్ డేట్స్ రానున్నాయి.


కొంత‌మంది వినియోగ‌దారుల‌కు ఈ ఫోన్ అందించి, దీనిపై అడ్వాన్స్డ్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు సమాచారం. ప్ర‌స్తుతం నెల‌కొన్న సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త స‌మ‌స్య కూడా అప్ప‌టికి తీరే అవ‌కాశం ఉంద‌ని జియో అంచ‌నా వేస్తుంది.


ఈ సెమీ కండ‌క్ట‌ర్ల స‌మ‌స్య కేవలం మొబైల్ పరిశ్ర‌మ‌నే కాకుండా.. ఆటోమొబైల్స్, వీడియో గేమ్ క‌న్సోల్స్ ప‌రిశ్ర‌మ‌ల‌ను కూడా వేధిస్తుంది.


జియోఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేష‌న్లు(అంచ‌నా)
ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేష‌న్ల‌ను జియో ప్ర‌క‌టించ‌లేదు కానీ.. ఆన్ లైన్ లో ఇవి ఇప్ప‌టికే లీక‌య్యాయి. ఇవి కేవ‌లం జియో నెట్ వ‌ర్క్ తో మాత్ర‌మే ప‌నిచేసే అవ‌కాశం ఉంది. గూగుల్ ప్లేస్టోర్ యాక్సెస్, కేవ‌లం మ‌న‌దేశానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ప్ర‌త్యేక‌మైన‌ స్నాప్ చాట్ లెన్స్ కూడా ఇందులో ఉండనున్నాయి.


ఆండ్రాయిడ్ 11(గో ఎడిష‌న్) ఆప‌రేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ ప‌నిచేసే అవ‌కాశం ఉంది. 5.5 అంగుళాల డిస్ ప్లేను ఇందులో అందించ‌నున్నట్లు స‌మాచారం. క్వాల్ కాం క్యూఎం215 ప్రాసెసర్ పై ఈ ఫోన్ ప‌నిచేయ‌నున్నట్లు తెలుస్తోంది.


దీని బ్యాట‌రీ సామ‌ర్థ్యం 2500 ఎంఏహెచ్ గా ఉండ‌నుంది. 2 జీబీ, 3 జీబీ ర్యామ్ ఆప్ష‌న్లు, 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంద‌ని స‌మాచారం.


Also Read: Ford Cars: భారత్‌కు ఫోర్డ్‌ కంపెనీ షాక్‌.. కార్ల తయారీ నిలిపివేత.. కానీ కస్టమర్లకు సేవలుంటాయట


Also Read: Realme 8s: 64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 8ఐ.. ప్రారంభ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్లు..