తెలుగు రాష్ట్రాల్లో గణపతి ఉత్సవాలు మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బొజ్జగణపయ్యలకు పూజలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, గవర్నర్లు తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయచవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఖైరతాబాద్ లో వైభవంగా వేడుకలు
హైదరాబాద్ ఖైరతాబాద్ గణపయ్య కొలువుదీరాడు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజ నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ పూజలో పాల్గొననున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ మహాగణపతి ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. తెల్లవారుజామునే ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి భక్తులు పోటీపడ్డారు. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకుడికి భక్తులు గజమాల సమర్పించారు. ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం కండువా, జంజం, గరికమాల సమర్పించింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఐజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి హోమంతో ప్రారంభమైన గణనాథుని ఉత్సవాలు 21 రోజుల పాటు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా కాణిపాకం ఆలయంలో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. వినాయక చవితి నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. క్యూలైన్ లో గణేశుని దర్శనార్థం కోసం భక్తులు వేచిఉన్నారు. కరోనా నియమాలు పాటిస్తూ స్వామి వారి దర్శనం పొందాలని ఆలయ ఈవో వెంకటేశు భక్తులకు సూచించారు. వీఐపీలు తమ దర్శనాలను వాయిదా వేసుకోవాలని కోరారు. సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ
ఆలయ పునర్నిర్మాణ దశలో ఉండటంతో ఆలయం లోపల తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా సూచికలు ఏర్పాటు చేశారు. మాస్కు లేనిదే ఆలయంలోపలకు అనుతించమని ఈవో వెంకటేశ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వినాయకునికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Also Read: vinayaka Chavithi: ఈ అష్ట వినాయకులను దర్శిస్తే... విజయాలన్నీ మీవే