హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసినా హైకోర్టు దాన్ని తోసి పుచ్చింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ సమస్య పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ అధికారులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. అవసరమైతే, సుప్రీం కోర్టుకు వెళ్లాలా? లేదా నిమజ్జనానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా అనే దానిపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గత వారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరారు. హుస్సేన్ సాగర్, ఇతర చెరువుల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరారు. సాగర్‌లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని, హుస్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ కోరింది.
అలాగైతే నిమజ్జనానికి 6 రోజుల సమయం
ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలను అనుమతించక పోతే.. మొత్తం విగ్రహాలు పూర్తి కావడానికి 6 రోజుల సమయం పడుతుందని జీహెచ్‌ఎంసీ పిటిషన్‌లో పేర్కొంది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కూడా కొంత సమయం అవసరమని వివరించింది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని విన్నవించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది. ఇందు కోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపింది. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది.
ఒప్పుకోని ధర్మాసనం
అయితే, ఈ అంశాలతో ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్ సాగర్‌ను కాలుష్యం చేయమని తాము చెప్పలేమని స్పష్టం చేసింది. నిమజ్జనంపై తమ తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.