ఉద్యోగార్థులు, వేతన జీవులకు శుభవార్త!  ఉద్యోగార్థులకు దసరా, దీపావళి బొనాంజా రానుంది. గత రెండేళ్లతో పోలిస్తే ఉపాధి సృష్టికి రాబోయే త్రైమాసికమే అత్యుత్తమం అని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.


అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో కొత్త ఉద్యోగాల వెల్లువ రానుందని సంస్థలు అంటున్నాయి. గత ఏడేళ్లతో పోలిస్తే నియామకాలు అత్యుత్తమంగా ఉండనున్నాయని అంచనా వేస్తున్నాయి. కరోనా ఆంక్షలు సడలించడం, ఉత్పత్తులు, సేవలకు గిరాకీ పెరగడమే ఇందుకు కారణం.


ఉద్యోగ నియామకాలపై ఓ జాతీయ సంస్థతో కలిసి మ్యాన్‌ పవర్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న ౩,046 కంపెనీల్లో  64 శాతం రాబోయే త్రైమాసికంలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలిపాయి.


జులై- సెప్టెంబర్‌తో పోలిస్తే భారీ స్థాయిలో నియామకాలు చేపడతామని ఆరు శాతం కంపెనీలు చెప్పగా... అదనంగా ఉద్యోగులను తీసుకుంటామమని 20 శాతం,  ఉద్యోగుల సంఖ్యలో మార్పులేమీ ఉండవని 15శాతం కంపెనీలు చెప్పాయి.  ఒక శాతం కంపెనీలు మాత్రమే ఉద్యోగ నియామకాలపై స్పష్టతనివ్వలేదు. గత క్వార్టర్లో వీరిది 14శాతం కావడం గమనార్హం.


ఏడేళ్ల తర్వాత..


ఇక నికర ఉద్యోగిత అంచనా (నెట్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌) గత త్రైమాసికంలోని 7శాతంతో పోలిస్తే 44శాతానికి పెరిగింది.  నియామకాల శాతం  గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 40 పర్సంటేజీ పాయింట్లు పెరిగింది. 2014 జులై-సెప్టెంబర్‌లో నికర ఉద్యోగిత అంచనా అత్యధికంగా 48శాతం కావడం గమనార్హం. అంటే ఏడేళ్ల తర్వాత ఇప్పుడే అత్యధికంగా నెట్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ ఉండటం ప్రత్యేకం.


సేవలు, తయారీ రంగాలే టాప్‌


ప్రస్తుత అధ్యయనం ప్రకారం రాబోయే త్రైమాసికంలో  దాదాపు ఏడు రంగాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.  సేవల రంగంలో 50, తయారీ రంగంలో 43, ఆర్థిక, బీమా, స్థిరాస్తి రంగాల్లో 42శాతం వరకు వేతనాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.


ఇక ప్రాంతాల వారీగా  పశ్చిమ భారతదేశంలో అత్యధికంగా 49శాతం నెట్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ కనిపిస్తోంది.  తూర్పున  45, ఉత్తరాన 43, దక్షిణాన 37శాతంగా ఉంది.


'మొత్తంగా ఉద్యోగ నియామకాల్లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. పండగల సీజన్‌, వేగంగా కరోనా టీకాలు వేయడం, ఇంటి వద్ద పనిచేస్తున్న వారు కార్యాలయాలకు చేరేందుకు ప్రభుత్వాలు పూర్తిగా అనుమతులు ఇస్తుండటం  కార్పొరేట్‌ భారతంలో ఆశలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తుండటం చేయూతనిస్తోంది' అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా, ఎండీ సందీప్‌ గులాటీ అన్నారు.