తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెరిగాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను మూడు విభాగాలుగా పెంచింది. లోయర్ రేంజ్ మార్కెట్ విలువలున్న ఆస్తులపై 50 శాతం, మిడ్ రేంజ్ లో ఉన్న విలువలపై 40 శాతం, హయ్యర్ రేంజ్‌లో ఉన్న విలువలపై 30 శాతం చొప్పున పెంచింది. వీటితో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. పెరిగిన మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. 22న…ఆ తర్వాత తేదీల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్లకు కూడా కొత్త విలువలే వర్తింపచేసింది ప్రభుత్వం. ఇందుకోసం ‘ధరణి’ పోర్టల్‌లో ‘అడిషనల్ పేమెంట్స్ ఫర్ స్లాట్స్ ఆల్‌రెడీ బుక్డ్’ పేరుమీద పెట్టిన కొత్త విభాగంలో అదనపు ఛార్జీల వివరాలు పొందుపర్చారు.
మూడొంతులు పెరిగిన వ్యవసాయ భూముల ధరలు
వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరానికి ఇప్పటి వరకు కనీస మార్కెట్ విలువ 10 నుంచి 25 వేల వరకు ఉండగా.. దీన్ని 75 వేలకు పెంచింది. ప్రస్తుతం ఎకరానికి తక్కువ స్థాయిలో ఉన్న మార్కెట్ విలువలపై 50 శాతాన్ని పెంచింది. మధ్య స్థాయిలో ఉన్న విలువపై 40 శాతం, అత్యధికంగా ఉన్న విలువపై 30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సమీపంలో వ్యవసాయ భూములపై 30 శాతం మేర, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ భూములపై 50 శాతం మేర, ఓ మోస్తరు పట్టణాలకు దగ్గరగా ఉండే భూములపై 40 శాతం మేర విలువలు పెరిగాయి.
ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువ ఎంత పెరిగిందంటే…
వ్యవసాయేతర ఆస్తుల కిందకు వచ్చే ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువలను మూడు కేటగిరీలుగా.. అపార్ట్‌మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల మార్కెట్ విలువలను రెండు కేటగిరీలుగా పెంచారు. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస విలువ ప్రస్తుతం 100గా ఉంది. ఇప్పుడు దీన్ని డబుల్ చేసేశారు. ఓపెన్ ప్లాట్లకు సంబంధించి తక్కువస్థాయిపై 50శాతం, మధ్యస్థాయిపై 40శాతం, అధికస్థాయిపై 30శాతం చొప్పున విలువలను పెంచింది. అపార్ట్‌మెంట్లు, వాటిలోని ఫ్లాట్ల కనీస మార్కెట్ విలువను చదరపు అడుగుకు 800 నుంచి 1000కి పెంచింది. తక్కువ స్థాయిపై 20 శాతం, ఎక్కువ స్థాయిపై 30 శాతం మేర మార్కెట్ విలువలు పెంచింది.
ఆచి తూచి అడుగేసిన టీ సర్కార్
మార్కెట్ విలువలు సుదీర్ఘ కాలం తర్వాత పెంచినప్పటికీ భారీ స్థాయిలో బాదుడు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందనే చెప్పాలి. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో భూముల కొనుగోళ్లపై దృష్టి సారించాయి. దేశంలోని ఏ నగరంలో లేనంతగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయులో మార్కెట్ విలువలను పెంచితే రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడుతుందని యోచించింది. మార్కెట్ విలువలను చివరిసారిగా 2013లో సవరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విలువలను పెంచడానికి సాహసించలేదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదాయ వనరులు తగ్గిపోవడంతో సర్కారు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించింది. జూన్ 13న జరిగిన కేబినెట్ భేటీలోనే పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
రెండు రోజుల ముందే సర్వర్లు డౌన్
భూముల మార్కెట్ విలువల పెంచుతున్నట్లు ప్రకటించడానికి ముందుగానే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. జూన్ 20 సాయంత్రం 5 గంటలకల్లా రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు మెసేజ్ లు పంపించారు. దీంతో సర్వర్ డౌన్ అయింది. జూన్ 20 మధ్యాహ్నం 3.30 గంటల సమయంలోనే సబ్ రిజిస్ట్రార్లకు మెసేజ్‌లు పంపించడంతో పలు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కార్డ్ సర్వర్ ను నిలిపేశారు. వాస్తవానికి భూముల మార్కెట్ విలువలు పెరుగుతాయన్న సమాచారం మేరకు జూన్ రెండో వారం నుంచే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రాత్రి 7, 8 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.