వేసవి తాపం నుంచి వర్షా కాలం మంచి రిలీఫ్ ఇస్తుంది. వాతావరణంలో ఒకేసారి మార్పులు రావడంతో ఈ సీజన్‌లో పలు అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అసలే ఇది కరోనా కాలం. రెండేళ్ల క్రితం ఇదే సీజన్‌లో తుమ్మినా దగ్గినా ఈ ఏ సీజనల్ జలుబో అయి ఉంటుందిలే అనుకునే వారు.. కానీ ఇప్పుడు దగ్గడం సంగతి అటుంచి కాస్త గొంతు మారినా భయంతో హడలెత్తిపోతున్నారు. మరి ఇలాంటి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో పాటు ఇతర ప్రమాదకర రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటివి తీసుకోకూడదు వంటి విషయాలు మీకోసం.. 





  • వర్షాకాలంలో కలుషిత నీటి ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంది. వీటి ద్వారా కడుపులో ఇన్ఫెక్షన్లు, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాధమైనంత వరకు నీటిని వేడి చేసుకుని.. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి.





  • వర్షా కాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త మందగిస్తుంది. కాబట్టి నూనెలలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బజ్జీలు, పకోడీలు, సమోసాలు వంటి వాటిని తినడం ద్వారా అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బయట దొరికే జంక్ ఫుడ్ ను కూడా వీలైనంత వరకు దూరం పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. 





  • కరోనా కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. దీని కోసం తులసి, అల్లం, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన హెర్బల్ టీ లేదా మసాలా టీ తాగవచ్చు. గ్రీన్ టీ, లెమన్ టీ కూడా ఆరోగ్యానికి మంచివేనని పలు అధ్యయనాల్లో తేలింది. వీటికి అన్ని రకాల ఇన్ఫెక్షన్లను నివారించే గుణాలు ఉన్నాయి. 

  • అల్లం, పసుపు, నల్ల మిరియాలు, లవంగం వంటి సుగంధ్ర ద్రవ్యాల్లో క్రిమినాశక మరియు రోగ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీటిని వంటల్లో చేర్చితే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.




  •  వర్షా కాలంలో ఆకుకూరల ద్వారా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయని చెబుతున్నాయి. కాబట్టి వీటిని కూడా తినకపోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.




  • నిమ్మ, బత్తాయి వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కాబట్టి ఏదోక రూపంలో వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

  • ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని, వీటి ద్వారా జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.