భారతదేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (Avian influenza) మరణం నమోదైంది. బర్డ్ ఫ్లూ సోకిన 12 ఏళ్ల బాలుడు ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని వారికి సూచించినట్లు పేర్కొన్నారు. 


హరియాణాకు చెందిన 12 ఏళ్ల బాలుడు లూకేమియా, న్యూమోనియా లక్షణాలతో ఈ నెల 2వ తేదీన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. తొలుత వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అనంతరం బాలుడి నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపారు. అక్కడ హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (H5N1 Avian influenza) పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 


ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్ ద్వారా బర్డ్ ఫ్లూ సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ శాతం కోళ్లు, పక్షులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన జీవులను తాకడం, తినడం వల్ల మనుషులకు వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం హెచ్5ఎన్1 వైరస్ మనుషులకు సోకడం చాలా అరుదు. బర్డ్ ఫ్లూ సోకిన వారిలో మరణాల రేటు 60 శాతంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. 



2021 ప్రారంభం నుంచి మన దేశంలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. కేరళ, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్, రాజస్థాన్‌, బిహార్ రాష్ట్రాల్లో కోళ్లు, బాతులు, నెమళ్లు సహా పలు పక్షి జాతులకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హరియాణాలో దాదాపు లక్ష కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు. 
లక్షణాలు ఏంటి?
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, వణుకు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షులు, జంతువులతో ఎక్కువ సమయం గడిపేవారికి బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. పక్షుల విసర్జకాలు, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన పక్షులను తినడం ద్వారా కూడా ఇది మనుషులకు సోకుతుంది. 



నివారణ ఎలా?
చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న పక్షులు, జీవులను తాకవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోళ్ల పౌల్ట్రీల్లో పనిచేసేవారు, పక్షులతో ఎక్కువసేపు దగ్గరగా గడిపే వారు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే పీపీఈ కిట్లు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 
పచ్చి మాంసం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ బతకదు. కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు ఎక్కువ సేపు ఉడికించాలి. ప్రస్తుతం ఈ వైరస్‌ బారిన పడ్డవారికి యాంటీవైరల్‌ మందులతోపాటు పారాసిటమాల్ మాత్రలను అందిస్తున్నారు.