సినీ ఇండస్ట్రీపై కరోనా ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. థియేటర్లన్నీ మూసేయాల్సిన పరిస్థితి కలిగింది. అయితే ఫస్ట్ వేవ్ అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే జనాలు ఎగబడి థియేటర్లకు వెళ్లారు. పాత సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేసి జనాలను థియేటర్లకు రప్పించగలిగారు. యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా మంచి లాభాలను చవిచూశారు. అయితే సెకండ్ వేవ్ తరువాత జనాల్లో మార్పొచ్చింది. థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 



దీనికి ఉదాహరణగా కన్నడ ఇండస్ట్రీని తీసుకోవచ్చు. కర్ణాటకలో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కర్ణాటకలో మొత్తం 600కి పైగా సింగిల్ స్క్రీన్లు ఉండగా.. 260 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే వీటిలో తొలిరోజు కేవలం పది శాతం మాత్రమే తెరుచుకున్నాయి. ఆ థియేటర్లు కూడా ప్రేక్షకులు లేకపోయేసరికి సాయంత్రానికి మూసేశారు. ఈ దెబ్బకు మిగిలిన థియేటర్ల యాజమాన్యాలు కూడా తమ థియేటర్లు తెరవడానికి వెనుకడుగు వేస్తున్నారు. 



పాత సినిమాలు వేయడానికైనా.. జనాలను థియేటర్లకు అలవాటు చేయడానికైనా.. మొదట్లో సినిమా హాళ్ల ఓనర్లు రిస్క్ తీసుకోక తప్పదు. యాభై శాతం ఆక్యుపెన్సీతో కష్టమైనా.. గతంలో అలాంటి ధైర్యం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అలాంటి రిస్క్ తీసుకుందామన్నా.. జనాదరణ అసలు లేకపోవడం గమనార్హం. 



ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఈ నెల 23 నుండి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. యాజమాన్యాల రిక్వెస్ట్ మేరకు సింగిల్ స్క్రీన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇప్పట్లో జనాలు థియేటర్లు వచ్చేలా కనిపించడం లేదు. అందుకే ఈ మధ్యకాలంలో కాస్త పేరున్న సినిమాలను కూడా ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. రీసెంట్ గా 'నారప్ప' లాంటి పెద్ద సినిమా కూడా ఓటీటీలోకే వచ్చింది. 



ఇప్పుడేమో థర్డ్ వేవ్ అంటున్నారు. ఈ భయంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించినా.. ఇప్పుడు వాయిదా వేసుకోవాలని చూస్తున్నారట. మంచి ఆఫర్లు వస్తే గనుక ఓటీటీలకు సినిమాలను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో మాత్రం థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొన్నామధ్య ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో ఏపీలో ఇప్పుడున్న రేట్లను బట్టి థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదనిపిస్తుంది. కానీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం థియేటర్లోనే విడుదల అవుతాయని వాటి మేకర్స్ చెబుతున్నారు. అదే గనుక జరిగితే జనాలు థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. అప్పుడైతే థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!