ఇతర మతాల వారిని గౌరవించడమే కాదు, వారిని కూడా ఆదరించి తనలో ఐక్యం చేసుకోవడమే హిందూ మతం గొప్పదనం అంటారు. హిందూ మతం ప్రపంచ అతిపెద్ద మతాల్లో ఒకటి. ప్రపంచంలోని పూరాతన మతాల్లో ఒకటి.

  అందుకే  చాలా మంది విదేశీయులు హిందూ మతవిశ్వాసాలపై మక్కువతో ఇతర మతాల నుంచి హిందూత్వం స్వీకరిస్తున్నారు. వాళ్లెవరో చూద్దాం..




అకాడమీ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కొన్నేళ్ల క్రితమే హిందూమతంలోకి మారారు. బాప్టిస్ట్ ,  కాథలిక్ దంపతులకు అమెరికాలో జన్మించిన జూలియా రాబర్ట్స్ నాటింగ్ హిల్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, ప్రెటీ విమెన్ లో నటించింది. 2009లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో భారతదేశం వచ్చిన జూలియా హిందూమత సంస్కృతికి ప్రభావితమైంది. ఆ తర్వాత హిందూమతం స్వీకరించింది.




హిందూమనతంలోకి మారడం వెనుక ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పింది జూలియా రాబర్ట్స్. ముఖ్యంగా మనుషుల్ని, మతాన్ని పోల్చి చూడడం సరికాదన్న ఈ హాలీవుడ్ బ్యూటీ…అసలైన ఆధ్యాత్మిక సంతృప్తి హిందూమతంలోనే పొందానంది. ఆంజనేయుడి ఫొటోలు, మహారాజ్ జీ అని పిలిచే నీమ్ కరోలీ బాబా  ఫొటోలు చూసి హిందూమతంపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పింది జూలియా. ఆమెకి  హిందూమతం గురించి పూర్తిగా తెలియని రోజుల్లో కూడా రాబర్ట్స్ కుటుంబం గుడికి వెళ్లి పూజలు, భజనలు చేసేదట.


ఇంతకీ అక్కడెక్కడో అమెరికాలో ఉన్న జూలియా రాబర్ట్స్ కి భారతదేశం ఎందుకొచ్చింది? హిందూమతం గురించి ఎలా తెలుసుకుందనేది చూస్తే….జూలియా మొదట చెప్పే మాట యోగా.  యోగాపై మొదలైన ఆసక్తి అలా అలా హిందూమతంపైకి మళ్లిందట. 2009లో ఈట్ ప్రే లవ్ షూటింగ్ సందర్భంగా భారతదేశానికి వచ్చిన జూలియా హర్యానాలో ఓ ఆశ్రమంలో ఉంది. అప్పటి నుంచి మెల్లమెల్లగా హిందూత్వంవైపు ఆకర్షితురాలైంది.




ఒక్కసారిగా హిందువుగా మారిపోవాలని అనుకోలేదు జూలియా రాబర్ట్స్. మన సంప్రదాయానికి చిహ్నం అయిన బొట్టు పెట్టుకోవడం ద్వారా హిందూమతం విశ్వాసాలను పాటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తన ప్రొడక్షన్ కంపెనీ పేరు రెడ్ ఓం ఫిలిమ్స్ అని పెట్టింది. ఇక్కడ ఓం అనే శబ్ధానికి హిందూమతంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు.




అకార ఉకార మకారాలలో అకారం... భూమి, చె ట్లు లేదా ఇతర వస్తువులకు, ఉ కారం... ఆకారం, రూపం లేని నీరు, గాలి, నిప్పులకు… మకారం... ఆకృతి ఉండీ లేనటువంటివానికి ప్రతీకగా ఉండటం. అంటే ప్రపంచంలో దృఢమైన శక్తి కలిగి ఉండటం. ఈ మూడు పదాంశాలను కలిపితే ఓం వస్తుంది. అంటే ఈ మూడూ కలిస్తేనే సృష్టి అన్నమాట. ఓంకారాన్ని నిరంతరాయంగా ఉచ్చరిస్తూండటం వల్ల, శాశ్వతప్రపంచంలో, అంటే జీవుడు శరీరం విడిచిన తరవాత మోక్షం పొందగలుగుతాడని చెబుతారు.  ఓంకారానికి మతపరంగా ఎనలేని ప్రాధాన్యముంది. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతినామానికీ మొదటగా ఓంకారాన్ని చేర్చిన తర్వాతే ఉచ్చరిస్తారు. సృష్టి ప్రారంభమయ్యాక వచ్చిన మొట్టమొదటి అక్షరం ఓంకారమని వేదోక్తి. ఈ లెక్కన తన ప్రొడక్షన్ కంపెనీకి ఓం అనే శబ్దాన్ని చేర్చిందంటే హిందుత్వాన్ని రాబర్ట్స్  ఎంతలోతుగా పరిశీలించిందో అర్థమవుతోంది.





బొట్టుపెట్టుకోవడం, తన ప్రొడక్షన్ కంపెనీకి పేరు పెట్టుకోవడంతోనే ఆగిపోలేదు. అంతకుమించిన విషయం ఏంటంటే ఓసారి జూలియా రాబర్ట్స్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు మన సంస్కృతిలో భాగంగా పిల్లలకు గుండు కూడా చేయించింది.




ఓ రకంగా చెప్పాలంటే క్రిస్మస్, దీపావళి ఒకటే అంటుంది రాబర్ట్స్. వెలుగులు వెదజల్లి చెడును పారద్రోలే పండుగ అంటుంది. దీపావళిని  ఓ మతానికి సంబంధించిన పండుగలా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏకగ్రీవంగా జరుపుకోవాల్సిన వేడుక అన్నది రాబర్ట్స్ అభిప్రాయం. దాదాపు నాలుగు పదుల జీవితంలో కుటుంబం, స్నేహితుల కారణంగా కొన్ని చెడు లక్షణాలు అలవడ్డాయని…వాటిని విడిచిపెట్టేసేందుకు హిందూత్వం సహకరించిందన్నది జూలియా అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ మతం వల్ల నిజమైన ఆధ్యాత్మిక సంతృప్తి లభించిందని...ఇందులో ఉన్న ఆధ్యాత్మికత మతం అనే అడ్డంకులను అధిగమించిందంటోంది.




జూలియా రాబర్ట్స్ మాత్రమే కాదు…మరికొందరు విదేశీయులు…ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రెటీలు తాము పుట్టిన మతాన్ని వదిలిపెట్టిన హిందూత్వాన్నివిశ్వశించారు. మరికొందరు హిందూత్వాన్ని స్వీకరించకపోయినప్పటికీ సనాతన ధర్మాన్ని నేర్పే గ్రంధాల పఠనానికి ఆసక్తి చూపించారు.ట




క్రైస్తవ కుటుంబంలో జన్మించిన అమెరికన్ మ్యూజిషియన్ జాన్ కోల్ట్రాన్, అమెరికన్ గాయకుడు , గిటారిస్ట్. గేయరచయిత ట్రెవర్ హాల్, కామెడియన్ రస్సెల్ బ్రాండ్, గాయకుడు- పుట్ బాల్ ఆటగాడు రికీ విలియమ్స్ తన సంగీతంతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించిన పాప్ సింగర్ మిలే సైరస్, సహా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో హిందూ మతానికి ఆకర్షితులయ్యారు….