క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు గొడవపడటం, ఒక్కోసారి కొట్టుకోవడం అప్పుడప్పుడూ మనం చూస్తాం. తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీంతో సహనం కోల్పోయిన క్రికెటర్లు బ్యాట్లతో కొట్టుకున్నారు. ఇద్దరు ఆటగాళ్లకి రక్తం వచ్చేలా గాయాలు కూడా అయ్యాయి. వీరిద్దరూ అక్కడే కిందపడిపోయినట్లు వీడియోలో కనిపించారు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. 


 


పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో నిర్వహించారు. మంచిపని కోసం నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తపాతంతో ముగియడంతో పలువురు విచారం వ్యక్తం చేశారు. దీంతో మంచిగా పలువురు మాట్లాడుకోవల్సిన ఈ అంశం గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారు.   






గొడవకి స్పష్టమైన కారణం తెలియడం లేదు. కానీ.. ఫస్ట్ బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. దాంతో.. ఇరుజట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. బ్యాట్‌లతో ఒకరిపై మరొకరు దాడిచేస్తూ కనిపించారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గొడవ సర్దుమణిగే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకి తాళలేక కిందపడిపోయి కనిపించారు.


 




 


‘‘ఇది ఫైనల్ మ్యాచ్.. మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్‌లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారు. ఆ గొడవకి స్పష్టమైన కారణం తెలియదు. కానీ.. ఓ ఇద్దరు ముగ్గురు మాత్రం బ్యాట్‌లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచారు. మొత్తంగా ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని నాశనం చేశారు’’ అని షెహజాద్ అక్రమ్ నిరాశ వ్యక్తం చేశాడు. గొడవ జరిగిన ప్రదేశానికి నేను దూరంగా ఉన్నాను. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ వాగ్వాదంలో ఉన్న ఆటగాళ్లపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వాళ్లని భవిష్యత్తులో మైదానంలోకి కూడా రాకుండా యాక్షన్ తీసుకుంటామని అక్రమ్ తెలిపాడు .