శ్రీలంక గడ్డపై భారత్‌కి చేజారిపోయినట్లు కనిపించిన మ్యాచ్‌ని దీపక్ చాహర్ అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. కొలంబో వేదికగా మంగళవారం అర్ధరాత్రి రాత్రి ముగిసిన రెండో వన్డేలో 276 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. 35.1 ఓవర్లు ముగిసే సమయానికి 193/7తో నిలిచింది. అప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ క్రీజులో లేకపోవడంతో భారత్ ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు.
కానీ.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7x4, 1x6) అసాధారణ పోరాట పటిమని కనబర్చి మరో 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టుని మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్: 28 బంతుల్లో 2x4) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీపక్ చాహర్- భువీ జోడీ 8వ వికెట్‌కి అజేయంగా 84 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. మొత్తంగా మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ జట్టు 2-0తో చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం కొలంబో వేదికగానే జరగనుంది.
276 పరుగుల ఛేదనలో భారత్ జట్టుకి పేలవ ఆరంభం లభించింది. మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన యువ ఓపెనర్ పృథ్వీ షా (13: 11 బంతుల్లో 3x4) మూడో ఓవర్‌లోనే బౌల్డయ్యాడు. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్ (1: 4 బంతుల్లో) తేలిపోగా.. కాసేపటికే కెప్టెన్ శిఖర్ ధావన్ (29: 38 బంతుల్లో 6x4) కూడా వికెట్ చేజార్చుకున్నాడు. తొలి వన్డేలో మెరుగ్గా ఆడిన ఈ ముగ్గురూ తక్కువ స్కోరుకే ఔటవడంతో భారత్ జట్టుపై ఒత్తిడిపడింది. కానీ.. ఒక ఎండ్‌లో ఓపికగా క్రీజులో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ (53: 44 బంతుల్లో 6x4) భారత్ జట్టుని మళ్లీ గెలుపు దిశగా నడిపించాడు. అయితే.. అతనికి కాసేపు సపోర్ట్ ఇచ్చిన మనీశ్ పాండే (37: 31 బంతుల్లో 3x4) పేలవరీతిలో రనౌట్‌గా వెనుదిరగగా.. ఆ తర్వాత వరుస విరామాల్లో సూర్యకుమార్, కృనాల్ పాండ్య (35: 54 బంతుల్లో 3x4) వికెట్లు చేజార్చుకున్నారు. దాంతో.. శ్రీలంక టీమ్ అలవోకగా గెలిచేలా కనిపించింది.
కానీ.. బాధ్యతాయుతంగా చివరి వరకూ క్రీజులో నిలిచిన దీపక్ చాహర్.. స్పిన్నర్ హసరంగాని గౌరవిస్తూనే చివర్లో ఫాస్ట్ బౌలర్లని టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టాడు. టీమిండియా విజయానికి చివరి 24 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో వరుసగా బౌండరీలు బాదుతూ వచ్చిన దీపక్ చాహర్.. భువనేశ్వర్ కుమార్‌తో మంచి సమన్వయం కనబర్చాడు. 12 బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో చాహర్, భువీ చెరొక ఫోర్ కొట్టడంతో భారత్ గెలుపు లాంఛనమైంది. ఆఖరి ఓవర్‌లో 3 పరుగులు అవసరమవగా.. మొదటి బంతినే బౌండరీకి తరలించిన దీపక్ చాహర్.. భారత్ జట్టుని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (50: 71 బంతుల్లో 4x4, 1x6) ఆ జట్టుకి మెరుగైన ఆరంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో చరిత అసలంక (65: 68 బంతుల్లో 6x4), చివర్లో చమిక కరుణరత్నె (44: 33 బంతుల్లో 5x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు 36.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించేసిన విషయం తెలిసిందే.