భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ చేస్తున్న వడ్ల పోరాటంలో మరో అంకం ప్రారంభం కానుంది. పంచాయతీల దగ్గర్నుంచి మున్సిపాల్టీల వరకూ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇందు కోసం తేదీలను ఖరారు చేశారు. తెలంగాణలో పండే ధాన్యమంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 27న మండల పరిషత్, 28న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, 29న డీసీసీబీ, డీసీఎంఎస్, 30న జిల్లా పరిషత్, 31న మున్సిపాలిటీల్లో పంజాబ్ మాదిరిగా రెండుపంటలు నూరుశాతం ధాన్యంను ఎంఎస్పీకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తారు. ఆ తర్వాత వాటిని కొరియర్ లేక పోస్టుల ద్వారా ప్రధాని మోదీ కార్యాలయానికి పంపుతారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.
కేంద్ర, రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా 'వడ్లపై వార్' కొనసాగుతోంది. మళ్లీ ఏప్రిల్ రెండవారం నుంచి యాసంగి వరికోతలు ప్రారంభమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం వరి వేయవద్దని రైతులను కోరింది. కానీ రైతులు ఎక్కువ మంది ప్రభుత్వం మాట వినలేదు. వరి పంట వేశారు. దీంతో యాసంగిలో సాగు చేసిన రైతుల్లో మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ... కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తి స్థాయి హామీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ధాన్యం కొనుగోలు అంశంపై యుద్ధం ప్రకటించారు. నలుగురు మంత్రుల నేతృత్వంలో బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కూడా కలిశారు. అయితే గోయల్.. తెలంగాణ ప్రభుత్వానిదే తప్పని.. ధాన్యం సేకరణ అంశంపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం మరింత రాజకీయం అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ మరింత ప్రత్యక్ష ఆందోళనలకు దిగాలని నిర్ణయించుకుంది. తీర్మానాల తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే ఈ తీర్మానాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఎలా వ్యవహరిస్తాయన్నదానిపై స్పష్టత లేదు. కొన్ని స్థానిక సంస్థలుఈ రెండు పార్టీల చేతుల్లో ఉన్నాయి. ఈ కారణంగా తీర్మానాల విషయంలో ఈ రెండు పార్టీలు రైతుల కోసం కలసి వస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలోపాజిటివ్‌గా స్పందించే అవకాశం లేదు.