Telangana Supreme Court :  తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు గతంలో ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పాలమూరు-రంగారెడ్డి “తాగునీటి ప్రాజెక్టు” పనులు కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది. సుప్రీం కోర్టు. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్.ఎమ్. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ముందు తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపిస్తూ, “తాగునీటి” ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని 2006 లో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింద‌ని పేర్కొన్నారు. 2006 వ సంవత్సరం, సెప్టెంబర్ నెలలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన “పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన” స్పష్టం చేసిన అంశాలను సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో . “రిజర్వాయర్ లెవల్” వరకు నిర్మాణ పనులు కొనసాగేందుకు అనుమతులు ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


డిసెంబర్‌లో జరిమానా విధించి పనులపై స్టే ఇచ్చిన ఎన్జీటీ 


గత ఏడాది డిసెంబర్ లో   అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వానికి రూ. 900 కోట్ల భారీ జరిమానాను ఎన్జీటీ విధించింది. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను పర్యావరణ సహా ఇతర అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని... ఈ అంశంలో గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని ఎన్టీటీ ఆరోపించింది. ఈ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వ్యయంలో 1.5 శాతం జరిమానా విధించింది. ఈ అంశంలో దాఖలైన పిటిషన్లపై పూర్తి విచారణ అనంతరం ఇవాళ చెన్నై ఎన్జీటీ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తప్పుపట్టిన ఎన్జీటీ బెంచ్... రూ. 900 కోట్ల జరిమానాను 3 నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద నష్టపరిహారం కింద జమ చేయాలని ఆదేశించింది.


ప్రాజెక్టుపై కోర్టుకెళ్లిన ఏపీ ప్రభుత్వం 


తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపడుతోందని ఆరోపిస్తూ.. కోస్గి వెంకటయ్య చెన్నై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్నూలు వాసి చంద్రమౌళీస్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరు పక్షాల తరపున వాదనలు నమోదు చేసుకున్న ఎన్జీటీ ధర్మాసనం... అక్రమ నిర్మాణం అని తేల్చింది.  అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్ట వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో రూ. 300 కోట్లు... పర్యావరణ నష్ట పరిహారం కింద.. పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో రూ. 528 కోట్లు... డిండి ప్రాజెక్టులో రూ. 92 కోట్లు చెల్లించాలని... తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


గడువులోపే సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్న తెలంగాణ ప్రబుత్వం  ! 


నష్టపరిహారం చెల్లింపునకు ఎన్జీటీ 3 నెలల ఇచ్చింది. ఈ లోపే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన  తెలంగాణ ప్రభుత్వం తీర్పుపై  స్టే తెచ్చుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం జరిమానా కట్టాల్సిన అవసరం లేదు. అదే సమయంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఏర్పడింది.