Nestle Shares: ఇవాళ్టి (శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023) ఇంట్రా డే ట్రేడింగ్‌లో నెస్లే ఇండియా (Nestle India) షేర్లు 4% క్షీణించి రూ. 18,837.6 కు చేరుకున్నాయి. మార్కెట్ అంచనాల కంటే తక్కువ ఆదాయాన్ని Q4లో (డిసెంబర్ త్రైమాసికం) ఈ కంపెనీ ఆర్జించింది.
2022 డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో, FMCG మేజర్ నెస్లే ఇండియా నికర లాభం సంవత్సరానికి (YoY) 66% వృద్ధితో రూ. 628 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 379 కోట్లుగా ఉంది.
ఈ కంపెనీ జనవరి- డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది కాబట్టి, డిసెంబర్ త్రైమాసికాన్ని నాలుగో త్రైమాసికంగా ఈ ఈ కంపెనీ పరిగణిస్తుంది.
డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 14% పెరిగి రూ. 4,233 కోట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,715 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో, కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం (revenue from operations) కూడా 14% జంప్ చేసి రూ. 4,257 కోట్లకు చేరుకుంది.
నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఎబిటా (EBITDA లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్) రూ. 973 కోట్లుగా లెక్క తేలింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నివేదించిన రూ. 851 కోట్లతో పోలిస్తే ఇది 14% పెరిగింది. కాగా, ఎబిటా మార్జిన్ 22.9% గా ఉంది.
రూ.75 డివిడెండ్
2022 మొత్తం సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 75 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో, బిఎస్‌ఈలో ఈ స్క్రిప్ 2.86% తగ్గి రూ. 19,060 వద్ద ట్రేడవుతోంది. గత 12 నెలల్లో ఈ షేరు కేవలం 6 శాతం లోపే పెరిగింది. గత ఆరు నెలల కాలంలో 3 శాతం పైగా నష్టపోయింది.
నెస్లే షేర్లను కొనాలా, అమ్మాలా, అట్టి పెట్టుకోవాలా? ఈ ప్రశ్నకు మార్కెట్ పండితులు చెప్పిన సమాధానం ఇది...
జెఫరీస్
"Q4లో అమ్మకాల వృద్ధి గణనీయంగా తగ్గింది. పెరిగిన పెట్టుబడి వ్యయాల ప్రభావం బాగా కనిపించింది. అయితే, మార్జిన్లు మెరుగుపడ్డాయి. రూ.50 బిలియన్ల మూలధన వ్యయం నేపథ్యంలో దీర్ఘకాలిక వృద్ధికి ఢోకా లేదు" అని జెఫరీస్ వెల్లడించింది. ఈ స్టాక్ మీద 'హోల్డ్' రేటింగ్‌తో రూ. 18,100 టార్గెట్ ధరను ఈ బ్రోకరేజ్ ఇచ్చింది.
మోర్గాన్ స్టాన్లీ
మోర్గాన్ స్టాన్లీ నెస్లే ఇండియా మీద 'అండర్ వెయిట్' రేటింగ్‌ను రూ. 15,315 టార్గెట్ ధరను ఇచ్చింది. "Q4 ఆదాయాలు మా అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. అయితే మార్జిన్లలో ముందుంది" అని తెలిపింది.
మోతీలాల్ ఓస్వాల్
ఈ స్టాక్ ప్రస్తుతం చాలా ఎక్కువ విలువతో ట్రేడవుతోందని చెప్పిన మోతీలాల్ ఓస్వాల్, ఈ స్టాక్ మీద 'న్యూట్రల్' రేటింగ్‌ను, రూ. 19,875 టార్గెట్ ధరను ఇచ్చింది.
ICICI డైరెక్ట్
ఐసీఐసీఐ డైరెక్ట్ నెస్లే ఇండియాపై 'హోల్డ్' రేటింగ్‌ను, రూ. 22,000 టార్గెట్ ధరను కూడా కొనసాగించింది. వచ్చే రెండేళ్లలో 200 bps ఆపరేటింగ్ మార్జిన్ వృద్ధితో పాటు హై సింగిల్-డిజిట్ వాల్యూమ్ గ్రోత్‌ను అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
ప్రభుదాస్ లీలాధర్
పామాయిల్, క్రూడాయిల్ వంటి కీలకమైన ఇన్‌పుట్ ధరలు చల్లబడ్డాయి కాబట్టి, 1Q23లో మరింత ఎక్కువ మార్జిన్ సాధించవచ్చని ప్రభుదాస్ లీలాధర్ అంచనా. ఈ స్టాక్‌కు 'అక్యుములేట్' రేటింగ్‌తో రూ. 20201 టార్గెట్ ధరను ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.