IND vs AUS 2nd Test:
దిల్లీ టెస్టు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది! భారత్, ఆస్ట్రేలియా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కంగారూలను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని హిట్‌మాన్ సేన పట్టుదలగా బౌలింగ్ చేస్తోంది. మంచి స్కోరు చేయాలని పర్యాటక జట్టు తపిస్తోంది. తొలిరోజు, శుక్రవారం భోజన విరామానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (50), ట్రావిస్ హెడ్ (1) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభమే లభించింది. టర్నింగ్ పిచ్ కావడంతో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ (15) నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖవాజా కాస్త దూకుడు ప్రదర్శించినా వార్నర్ మాత్రం ఆచితూచి ఆడాడు. అయితే 15.2వ బంతికి అతడిని మహ్మద్ షమి ఔట్ చేశాడు. రౌండ్ ది వికెట్ వచ్చిన వేసిన ఈ బంతి బ్యాటర్ బ్యాటు అంచుకు తగిలి నేరుగా కీపర్ శ్రీకర్ భరత్ చేతుల్లో పడింది.
ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (18) పోరాడాడు. నాలుగు బౌండరీలు బాదేశాడు. ఖవాజాకు అండగా నిలిచాడు. అతడిని అశ్విన్ పెవిలియన్ పంపించాడు. అతడు వేసిన 22.4వ బంతిని లబుషేన్ ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించాడు. మిస్సైన బంతి మోకాళ్లను తాకింది. అదే ఓవర్ ఆఖరి బంతికి స్టీవ్ స్మిత్ (0) డకౌట్ అయ్యాడు. పిచైన బంతిని ఆడబోయిన స్టీవ్ నేరుగా కీపర్‌కు క్యాచ్ ఇచ్చేశాడు.
ఒకవైపు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నా ఉస్మాన్ ఖవాజా మాత్రం అదరగొట్టాడు. భారత స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొన్నాడు. దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించాడు. ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 71 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. అతడిని ఔట్ చేస్తే ఆసీస్ కథ సగం ముగిసినట్టే. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (1) అతడికి అండగా ఉన్నాడు.
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీ, నేథన్ లైయన్, మాథ్యూ కుహెన్‌మన్