BazBall - Joe Root:  ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 'బజ్ బాల్' క్రికెట్ పేరుతో టెస్ట్ క్రికెట్లోనూ దూకుడును పరిచయం చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ల ఆధ్వర్యంలో సుదీర్ఘ ఫార్మాట్ లో దూకుడు శైలిని అవలంభిస్తోంది. బెదురులేని ఆటతో ఇటీవల ఆ జట్టు వరుస సిరీస్ లు గెలుచుకుంటోంది. ఈ విధానంతోనే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లపై సిరీస్ విజయాలు సాధించింది. అలాగే జులైలో భారత్ తో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టులోనూ గెలిచింది.  అయితే ఇప్పుడు ఈ బజ్ బాల్ క్రికెట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటారా...


ఇంగ్లండ్ డిక్లేర్డ్


మౌంట్ మాంగనుయి వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లకు 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. హ్యరీ బ్రూక్ (89), డకెట్ (84), ఓలీ పోప్ (42) రాణించారు. కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4 వికెట్లు తీశాడు. సౌథీ, కుగ్లెజిన్ తలా 2 వికెట్లు సాధించారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఇప్పుడు అసలు విషయమేమిటంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ ఔటైన విధానం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 






రివర్స్ స్వీప్ షాట్ తో ఔట్


జోరూట్.. సాంప్రదాయ టెస్ట్ క్రికెటర్. ఎప్పుడూ క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు రాబడుతుంటాడు. ఆధునిక క్రికెట్ షాట్లు వాడడు. అలాంటిది ఈ రోజు మ్యాచ్ లో రూట్ రివర్స్ స్వీప్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కివీస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వాగ్నర్ బౌలింగ్ లో లాఫ్టెడ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడి బౌండరీ రాబట్టాడు. ఆ తర్వాత మళ్లీ అదే బౌలర్ బౌలింగ్ లో అదే షాట్ ఆడి స్లిప్ లో ఉన్న డారిల్ మిచెల్ కు దొరికిపోయాడు. టెస్ట్ క్రికెట్ లో ఇలాంటి షాట్లు ఆడి ఔటవడం చాలా అరుదు. అలాంటిది అచ్చమైన టెస్ట్ బ్యాటర్ అయిన జో రూట్ ఇలాంటి షాట్ ఆడి పెవిలియన్ చేరడం విమర్శలకు దారితీసింది. దీనిపై నెటిజన్లు ఇంగ్లండ్ బజ్ బాల్ విధానాన్ని విమర్శిస్తున్నారు. 


ప్రస్తుతం న్యూజిలాండ్ 288 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో డెవాన్ కాన్వే (54 బంతుల్లో 17), వాగ్నర్ (13 బంతుల్లో 4) ఉన్నారు. టామ్ లాథమ్ (13 బంతుల్లో 1), కేన్ విలియమ్సన్ (21 బంతుల్లో 6), హెన్రీ నికోల్స్ (7 బంతుల్లో 4) నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.