IND vs AUS 2nd Test:
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు దిల్లీ వేదికగా మొదలైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మళ్లీ టాస్ గెలిచాడు. మొదటి మ్యాచులో చేసినట్టే తొలుత బ్యాటింగే ఎంచుకున్నాడు. ఈసారి మంచి స్కోరు చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
అందుకు తగ్గట్టే తొలి ఐదు ఓవర్లలో ఆసీస్ వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (13; 17 బంతుల్లో) మూడు బౌండరీలు బాదేశాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆచితూచి ఆడుతున్నాడు.
అరుణ్ జైట్లీ మైదానం పిచ్ మధ్యలో పచ్చిక ఉందని ప్యాట్ కమిన్స్ అన్నాడు. అయితే రెండు ఎండ్స్‌లో అస్సలు లేదని పేర్కొన్నాడు. టర్న్ బాగా అవుతుందని ఊహించాడు. కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. వారి స్థానాల్లో ట్రావిడ్ హెడ్, మాథ్యూ కుహ్‌నెమన్ వచ్చారన్నాడు.
టాస్ గెలిచుంటే తామూ మొదట బ్యాటింగే ఎంచుకోనేవాళ్లమని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పిచ్ నెమ్మదిగా ఉన్న తొలి టెస్టు తరహా బ్యాటింగే చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. టాస్ గురించి పట్టించుకోవద్దని, చక్కగా ఆడాలని కుర్రాళ్లకు చెప్పామన్నాడు.
టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా వందో టెస్టు ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని రోహిత్ చెప్పాడు. అతడి కుటుంబ సభ్యులూ ఈ మ్యాచుకు హాజరయ్యారని పేర్కొన్నాడు. వంద టెస్టులు ఆడటం సులభం కాదని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడని వెల్లడించాడు. జట్టులో ఒక మార్పు చేశామని, సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తీసుకున్నామన్నాడు.
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, టాడ్ మర్ఫీ, నేథన్ లైయన్, మాథ్యూ కుహెన్‌మన్
'టాప్' నిలవాలి
తొలి టెస్టులో విజయం సాధించినప్పటికీ భారత్ సరిదిద్దుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం. ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో టీమిండియా టాపార్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే రాణించాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, పుజారా, సూర్యకుమార్ యాదవ్ లు నిరాశపరిచారు. లోయరార్డర్ లో జడేజా, అక్షర్ పటేల్, షమీలు రాణించారు కాబట్టి భారత్ 400 స్కోరు చేయగలిగింది. కాబట్టి రెండో టెస్టులో టాపార్డర్ నిలవాల్సిందే. రాహుల్ ఓపికగా నిలబడ్డప్పటికీ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. స్పిన్ ను ఎదుర్కోవడంలో మంచి అనుభవమున్న పుజారా, కోహ్లీలు కూడా స్పిన్నర్ల బౌలింగ్ లోనే ఔటయ్యారు. ఇక టెస్ట్ అరంగేట్రం చేసిన సూర్యకుమార్ పరిమిత ఓవర్ల ప్రభావం నుంచి బయటకు రావాల్సి ఉంది. కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ లో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ గానూ సత్తా చాటాల్సిందే. రెండో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించాలంటే బ్యాటర్లు తమ సత్తా మేరకు రాణించాలి.
బౌలింగే బలం
భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగే ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానం కూడా స్పిన్నర్లకు సహకరిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ మ్యాచులోనూ స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అశ్విన్, జడేజా, అక్షర్ ల త్రయం మంచి ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా జడేజా పునరాగమనంలో బంతి, బ్యాట్ తోనూ చెలరేగాడు. జడ్డూ ఇదే ఫాం కొనసాగించాలని టీం భావిస్తోంది. ఇక అశ్విన్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. వీరిద్దరూ చెలరేగితే భారత్ కు తిరుగుండదు. అక్షర్ కూడా ఆల్ రౌెండర్ గా రాణిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, షమీలు తమ పాత్ర మేరకు ఆకట్టుకుంటున్నారు. కాబట్టి బౌలింగ్ లో భారత్ కు సమస్యలేమీ లేనట్లే.