Telangana government approved budget of 182 crores for police surrender leaves | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త అందించింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. 182.48 కోట్ల రూపాయల మొత్తాన్ని పోలీస్ సిబ్బందికి మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులను జారీ చేసింది.

Continues below advertisement


ఎంతోకాలం నుంచి పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్ లకు సంబంధించిన మొత్తం కోసం ఎదురు చూస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై పోలీస్ సంఘాలు హర్షం  వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన బకాయిలను సైతం దశలవారీగా మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం, డిప్యూటీ సీఎంలు తెలిపారు. 


కొనసాగుతోన్న బెటాలియన్ కానిస్టేబుళ్ల పోరాటం
ఏక్‌ పోలీస్‌ విధానం అమలు కోసం నిరసన తెలిపిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ ఎత్తివేసేదాకా పోరాటం చేస్తామని, అప్పటివరకూ పోరాటం ఆపేదిలేదని బెటాలియన్‌ కానిస్టేబుళ్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు మొదట నిరసన తెలిపాయి. ఆపై బెటాలియన్ కానిస్టేబుళ్లు రంగంలోకి దిగారు. తమ కుటుంబం అడుగుతున్న ప్రశ్నలు, వివరించిన పరిస్థితులు, సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 39 మందిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. 


Also Read: Kidambi Srikanth Wedding: నా పెళ్లికి రండి - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిదాంబి శ్రీకాంత్ ఆహ్వానం, వధువు ఎవరంటే! 


పలు జిల్లాల్లో విధులకు హాజరుకాకుండా వారు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. దాంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కడ హద్దు మీరినట్లు కనిపిస్తే వారిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిరసనలు, ఆందోళనలపై తెలంగాణ డీజీపీ సైతం సీరియస్ అయ్యారు. అత్యవసర సేవల కిందకు వచ్చే విభాగమైన పోలీసులు డ్యూటీ వదిలేసి, నిరసనలు, ఆందోళనల్లో పాల్గొని విధులకు గైర్హాజరు కావడం సరికాదని సూచించారు.