హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కిదాంబి శ్రీకాంత్.. తన వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. శ్రీకాంత్ కాబోయే భార్య శ్రావ్య వర్మ సైతం వెంట ఉన్నారు. తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని  కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ జంట సీఎం రేవంత్ రెడ్డికి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు. 


పెళ్లి పీటలు ఎక్కబోతున్న మాజీ నెంబర్ వన్
తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ గతంలో బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించాడు. అంతర్జాతీయంగా పలు టోర్నీల్లో విజేతగా నిలిచి సత్తా చాటాడు. 2018లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం శ్రీకాంత్ ను సత్కరించింది. 2015లో అర్జున అవార్డు దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు.






వధువు ఎవరో తెలుసా..
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ సినీ పరిశ్రమకు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఆమె మరెవరో కాదు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ. ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్నారు. టాలీవుడ్‌లోనూ పలువురు నటీనటులకు కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగానూ శ్రావ్య వర్మ వ్యవహరించారు. అక్కినేని నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ లాంటి స్టార్స్ సహా పలువురికి పర్సనల్ స్టైలిస్ట్ గా చేశారు. కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సినిమాకు శ్రావ్య వర్మ నిర్మాతగా వ్యవహరించారని తెలిసిందే.


Also Read: Amaravati News: త్వరలోనే అమరావతిలో బ్యాడ్మింటన్ క్లబ్ - ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూలో పుల్లెల గోపీచంద్