Andhra Pradesh News: ఆంధ్రుల నయా రాజధాని అమరావతిలో బ్యాడ్మింటన్ క్లబ్ పెడుతున్నట్టు ప్రఖ్యాత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ ప్రస్తుత కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఏబీపీ దేశంతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన ఆయన ఈ సర్ప్రైజ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశానని దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తానని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ అనేది కేవలం ధనవంతుల క్రీడ అనే అపోహ చాలా మందిలో ఉందని అలా కాకుండా ఈ స్పోర్ట్‌ని అందరికీ దగ్గర చేసేందుకు అమరావతి బ్యాడ్మింటన్ కోచింగ్ క్లబ్ ఉపయోగపడుతుందని పుల్లెల గోపీచంద్ తెలిపారు.
2014-19 టైంలోనే చంద్రబాబుకు మాట ఇచ్చిన గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 2016లో తొలిసారిగా ఒలింపిక్ మెడల్ గెలిచినప్పుడు అప్పటి ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఆమెను,కోచ్ గోపీచంద్‌ను ఘనంగా సన్మానించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "అమరావతిలో స్థలం ఇస్తాం ఏపీలో కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ " పెట్టాలని గోపిచంద్‌కు సూచించారు. గోపీచంద్ కూడా దానికి ఓకే అన్నారు. అయితే 2019లో టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోవడం తో ఆ ప్రపోజల్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో గోపీచంద్ ఆయన్ను కలిశానని తెలిపారు. ప్రస్తుతం అమరావతి పనులు వేగవంతం కావడంతో తన కోచింగ్ క్లబ్‌ను కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం కోసం గోపీచంద్ రెడీ అయ్యారు. పూర్తి వివరాలు త్వరలోనే గోపీచంద్ అన్నారు.
సింధు, సైనాకు వచ్చిన పేరు పురుషులకు అందుకే రాలేదు : గోపీచంద్
బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధుకు వచ్చిన పేరు, మీడియా గ్లామర్ పురుషలకి రాకపోవడానికి కారణం సాధించిన మెడల్సే అన్నారు గోపీచంద్. క్రీడల్లో సాధించిన మెడల్స్‌ను బట్టి మీడియా ఇమేజ్ పెరుగుతుందన్న్నారు. ప్రస్తుతం కిదాంబి శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఒక్క ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆటోమేటిగ్గా వాళ్ళకీ ఇమేజ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతే తప్ప బాడ్మింటన్‌లో మహిళలకే ఎక్కువ పేరు వస్తుందనేది వట్టి అపోహ మాత్రమే అని పుల్లెల గోపీచంద్ ఏబీపీ దేశంతో ఎక్స్ క్లూజివ్‌గా తెలిపారు..
Also Read: కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!