ABP Southern Rising Summit 2024: 2001లో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచాక తానే గెలవగా లేనిది మిగతా వారు గెలవలేరా అనిపించిందని, అందుకే కోచింగ్‌ను ప్రారంభించానని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు తెలిపారు.


ఒలింపిక్స్ ముఖ్యం కాదు...
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ముఖ్యం కాదని, ఆట మనల్ని ఏ విధంగా మార్చిందనేదే ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. తన జీవితం మొత్తం బ్యాడ్మింటనే ఉంటుందని తెలిపారు. తాను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కొంతమంది క్రీడాకారిణులు సడెన్‌గా ట్రైనింగ్‌కు వచ్చే వారు కాదని, ఎందుకు రావడం లేదని అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఇప్పుడు తలుచుకున్నా కన్నీళ్లు వస్తాయని తెలిపారు. శానిటరీ నేప్కిన్లు కొనుక్కునే స్తోమత లేక ట్రైనింగ్‌క రాలేదని వారు తెలిపారని అన్నారు.


తాను ఆల్ ఇంగ్లండ్ గెలిచినప్పుడు కూడా రాని ఆనందం ఆ క్రీడాకారిణుల జీవితాలు మారినప్పుడు తనకు వచ్చిందని ఆయన అన్నారు. టాలెంట్‌ను రిఫైన్ చేయడం కూడా చాలా కీలకమని ఆయన అన్నారు.