Suriya About Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న సూర్య తన రీసెంట్ మూవీస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమా చేసే సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. పరాజయం పొందిన ప్రతిసారి అద్భుత విజయం సాధించాలని భావిస్తానని చెప్పారు. కరోనా కారణంగా ‘ఆకాశమే నీ హద్దు’, ‘జై భీమ్’ సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేకపోయాని చెప్పారు. ‘కంగువా’తో ఆ లోటు తీరబోతుందన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు.


నిరాశలో నుంచి కొత్త జోష్ లోకి..


‘ఆకాశమే నీ హద్దు’ సినిమాకు ముందు తన సినిమాలు పెద్దగా ఆడలేదన్నారు సూర్య. “ఆకాశమే నీ హద్దు’ సినిమాకు ముందు నేను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాను. మళ్లీ నా ఇమేజ్ పెంచుకోవాలి అనుకున్నాను. ఆ సమయంలోనే సుధా కొంగర నాకు ‘ఆకాశమే నీ హద్దు’ సినిమా గురించి చెప్పింది. ఈ సినిమా నాలో కొత్త జోష్ తీసకొచ్చింది” అని చెప్పుకొచ్చారు.


ఆ రేంజ్ సినిమా చేయాలనే కోరిక నెరవేరింది!


‘బ్రేవ్‌ హార్ట్‌, ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌‘, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌‘ లాంటి హాలీవుడ్ సినిమాలను చూసి ఆశ్చర్యపోతాం తప్ప, అలాంటి సినిమా చేయాలనే ఆలోచన చాలా మంది ఇండియన్ మేకర్స్ లో రావడంలేదన్నారు సూర్య. “చాలా మంది మేకర్స్ హాలీవుడ్ సినిమాలు చూసి అద్భుతంగా ఉన్నాయి అనుకుంటారు. కానీ, అలాంటి సినిమాలు మనం చేయాలి అనుకోవడం లేదు. ఇలాంటి సమయంలో శివ నాకు ఈ కథ చెప్పారు. ‘కంగువా’ అనేది భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రయత్నం. ఈ సినిమా వందేళ్ల క్రితం జన జీవన విధానాన్ని చూపిస్తుంది. ఈ సినిమాతో హాలీవుడ్ సినిమా చేయాలనే కోరిక నెరవేరింది. కథ ఎలా అనుకున్నామో, తెర మీద అవుట్ ఫుట్ అంతకు మించి వచ్చింది” అన్నారు సూర్య.


నా సినిమా చూసి ఐపీఎస్ అయ్యారు!


ఇక తన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుందని సూర్య చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలకు దక్కుతుందన్నారు. “నేను నటించిన ‘కాఖా కాఖా’ సినిమా చూసి ఐపీఎస్ ఆఫీసర్ అయినట్లు చెప్పడం నాకు సంతోషాన్ని కలిగించింది. ‘జై భీమ్’ లాంటి సినిమాల వల్ల తమిళనాడులో ఎంతో మందికి ఇళ్ల పట్టాలు, ఓటర్ ఐడీలు వచ్చాయి. మంచి సినిమాలు ప్రజల జీవితాలను మార్చుతాయి అనేదానికి ఇదో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు” అన్నారు సూర్య.


సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 14న 30కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదలకాబోతోంది.  


Read Also: తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ జోరు - వామ్మో థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా?