Game Changer Telugu States Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘RRR’ లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగడిం..’, ‘రా మచ్చా..’ అనే పాటలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెంటు పాటలు యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ అందుకున్నాయి. ఈ సాంగ్స్ చూసిన తర్వాత సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి బిజినెస్
అటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ. 150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ పెరిగినట్లు తెలుస్తోంది. నిజానికి తెలుగులో ఈ స్థాయి బిజినెస్ జరగాలంటే, వీలైనంత వరకు సినిమాల నడుమ పోటీ తక్కువగా ఉండాలి. అయితే, సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్ తో పాటు, సందీప్ కిషన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించి టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత థియేట్రికల్ బిజినెస్ మీద ఓ అంచనా ఏర్పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
భారీ ధరకు ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్
ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ కోసం పలు సంస్థ పోటీ పడగా, అమెజాన్ ఏకంగా రూ. 110 కోట్లు వెచ్చించి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ లోని అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ ను అమెజాన్ కొనుగోలు చేసిందట. హిందీ ఓటీటీ రైట్స్ అమెజాన్ తీసుకోలేదట. మరో ఓటీటీ సంస్థ సుమారు 50 కోట్లకు హిందీ స్ట్రీమింగ్ హక్కులకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓటీటీ రైట్స్ ద్వారా ఈ సినిమాకు రూ. 150 కోట్ల బిజినెస్ జరిగింది. సుమారు రూ. 450 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్స్ ద్వారా పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదలకానుంది.
Read Also: బిడ్డ కోసం లగ్జరీ కారు కొనుగోలు చేసిన దీపికా దంపతులు - ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!