Ongole Crime News: ఒంగోలులో సంచలనం సృష్టించే కేసు ఒకటి రిజిస్టర్ అయింది. తల్లితో సహజీవన చేస్తూనే ఆమె కుమార్తెను ట్రాప్ చేసిన ఘటనపై కేసు నమోదు అయింది. ఒంగోలుకు సమీపంలో ఉంటున్న ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్తకు దూరంగా ఉంటున్న ఆ ఇద్దరి బాగోగులను టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు చూసే వాడు. ఈ క్రమంలోనే తల్లికి చాలా దగ్గరయ్యాడు. అది కాస్త సహజీవనంగా మారిపోయింది. 


తల్లితో సహజీవనం చేస్తున్న రాజు... పదో తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను రోజూ స్కూల్‌కు తీసకెళ్లి తీసుకొచ్చే వాడు. ఇలా చేస్తూనే ఆమెను కూడా మోసం చేయడం ప్రారంభించాడు. కుమార్తెలా చూడాల్సిన పాపను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. 


ఇద్దర్నీ రెండు రకాలుగా మోసం చేస్తూ వచ్చిన రాజు... ఒకరి విషయాలు ఇంకొకరుకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ మధ్య స్కూల్‌ కి వెళ్లిన బాలిక ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిందా తల్లి. అసలే రోజులు బాగాలేవంటూ తెలిసిన వారందర్నీ అడిగింది. రాజు ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ వచ్చింది. 


స్కూల్‌కు వెళ్లిన కుమార్తె రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో భయపడిన ఆ తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె స్కూల్‌ కు వెళ్లి తిరిగి రాలేదని ఏం జరిగిందో చూడాలని విజ్ఞప్తి చేసింది. బాలిక అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు వివరాలు ఆరా తీశారు. స్కూల్‌కు వెళ్లి విచారిస్తే... రోజూ తీసుకొచ్చే వ్యక్తే ఆ రోజు బాలికను తీసుకెళ్లాడని విచారణలో తేలింది. 


బాలిక కనిపించకుండా వెళ్లిపోయినప్పటి నుంచి రాజు కూడా కనిపించడం లేదని తల్లి చెప్పింది. వివరాలు పూర్తిగా తీసుకున్న పోలీసులు రాజుతో వెళ్లిపోయినట్టు నిర్దారణకు వచ్చారు. రాజు స్నేహితులు, బంధువులను విచారించి రాజు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. రాజుతోనే ఆ పదో తరగతి బాలిక కూడా ఉందని స్పష్టమైంది. 


రాజు, బాలిక ఉంటున్న ఏరియా వివరాలు తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుకున్నారు. రాజును అరెస్టు చేసి ఒంగోలు తీసుకెళ్లారు. రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల అమ్మకు అప్పగించారు.