Telangana Farmers:  తెలంగాణ రాష్ట్ర రైతులపై రూ.1,12,492.31 కోట్ల వ్యవసాయ రుణభారం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో సభ్యుడు హనుమాన్ బేనీవాల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం చెప్పారు. ఆ ప్రకారం తెలంగాణలో 73,68,528 ఖాతాల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారని.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తర్ ప్రదేశ్ లో 1,51,39,571 ఖాతాల ద్వారా అక్కడి రైతులు రూ.1,71,510.92 కోట్ల రుణాలు తీసుకోగా ఏపీ రైతులపై అంతకంటే 41.72 శాతం అప్పులు భారం ఉందని పేర్కొన్నారు. అలాగే  తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో 4 లక్షల 7 వేల 758 పిడుగులు పడినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పేర్కొన్నారు. ఆయన సోమవారం రోజు లోక్ సభలో ఈ బదులు ఇచ్చారు. 2019 నుంచి 21 మద్య మూడేళ్ల కాలంలో పిడుగుల కారణంగా 226 మంది చనిపోయినట్లు వెల్లడించారు. 


మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల క్రితం చేపట్టిన రుణ మాఫీ లెక్కను ఏ రోజుకు ఆరోజు ప్రభుత్వం వివరించింది. రెండు రోజుల్లో ఎంత మంది లబ్ధి పొందారో స్పష్టం చేసింది. రెండో రోజు అంటే శుక్రవారం రోజు 31 వేల 339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం తెలిపింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కల్గిన రైతులకు తెలంగాణ సర్కారు రూ.126.50 కోట్లు రుణాలను మాఫీ చేసింది. మొదటి రోజు మొత్తం రుణమాఫీకి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్​ రిలీజ్​ ఆర్డర్​ (బీఆర్వో) విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ గురువారం రూ.237.85 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 62,758 మంది రైతులకు లబ్ది చేకూరింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 94 వేల 97 మంది రైతులకు చెందిన రూ.364.34 కోట్లకు రుణ విముక్తి కల్గింది.


మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్‌ రెండో వారంలోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ ర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు.