CM KCR Comments in Huzurabad Meeting: ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావొద్దని, పరిణతితో ఆలోచించి రాయి ఏదో, రత్నం ఏదో తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, హుజూరాబాద్ (Huzurabad) ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయని, ప్రజలు ఎన్నికల్లో నిలబడింది ఎవరు?, అభ్యర్థి గుణగణాలు, పార్టీల చరిత్ర వంటి వాటిని చూసి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 'గతంలో నన్ను బాధ పెట్టారు. ఈసారి అలా జరగకూడదు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా?. బీఆర్ఎస్ (BRS)ను భారీ మెజార్టీతో గెలిపించాలి.' అని పేర్కొన్నారు.


కాంగ్రెస్ పై విమర్శలు


ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని, వారు అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని అంటున్నారని, ధరణి పోతే మీకు రైతు బంధు ఎలా వస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి తీసేసి భూ దందాలకు కాంగ్రెస్ పాల్పడాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, కాంగ్రెస్ 3 గంటల కరెంట్ కావాలో, బీఆర్ఎస్ పూర్తి స్థాయి కరెంట్ కావాలో ఆలోచించుకోవాలన్నారు. పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, పదేళ్ల పాలనలో 3.18 లక్షల తలసరి ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం ఉందని వివరించారు. తలసరి విద్యుత్ వినియోగంలోనే మనమే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా వ్యవసాయాన్ని పండుగలా చేశామని, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను అధిగమించి తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని చెప్పారు. కంటి వెలుగు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇలా అన్నీ సంక్షేమ పథకాలను ఓ విధానంలో ప్రజలకు మేలు చేకూర్చేలా తీసుకొచ్చామని వెల్లడించారు. 


'బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?'


కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్లు కోత విధించిందని, అలాంటి పార్టీకి తెలంగాణ ప్రజలు  ఓటెందుకెయ్యాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 'బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో ఉన్నా, కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇక్కడ నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు.? ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి.?' అని నిలదీశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినా తాను వినలేదని, రైతుల శ్రేయస్సే తనకు ముఖ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లు ఎంతో కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేశామని, అది అలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: Guarantess in BRS and Congress Manifesto: కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ మేనిఫెస్టో - ఆ వర్గాలే లక్ష్యంగా ది బెస్ట్ హామీలు, అధికారం అందేనా!