కొనసాగుతున్న సహాయక చర్యలు..
Uttarakhand Tunnel Collapse News in Telugu: ఉత్తరాఖండ్ సొరంగం ( Uttarakhand Tunnel Incident) వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు అధికారులు. స్పెషల్ రెస్క్యూ టీమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 120 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఆ 40 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగా (Uttarakhand Tunnel Collapse) ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్లు సురక్షితంగా బయటకు వస్తారా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్, నార్వే నుంచి రెండు రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. ఇప్పటి వరకూ కొండ చరియలను 30 మీటర్ల లోతు వరకూ డ్రిల్లింగ్ చేసి భారీ పైప్‌లు (Uttarakhand Tunnel Rescue Opearation) జొప్పించారు. వాటి ద్వారానే ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు. మొత్తం 5 పైప్‌లు అమర్చి కొంత వరకూ వాళ్లను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. అటు వైద్యులు మాత్రం వీలైనంత త్వరగా వాళ్లను బయటకు తీసుకురావాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఫిజికల్‌గానే కాకుండా మానసికంగా కూడా వాళ్లు కుంగిపోయే అవకాశముందని అంటున్నారు. శిథిలాలు మీద పడే ప్రమాదం ఉండడం వల్ల ప్రాణాలు కాపాడడం కాస్త సవాలుతో కూడిన పనే అంటున్నారు వైద్యులు.
"అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు బతుకుతామా లేదా, బయటకు వెళ్తామా లేదా అన్న అనుమానం, భయం పెరిగే కొద్ది ఆందోళన పెరిగిపోతుంది. తమకు ఎవరూ సాయం చేయడం లేదన్న అసహనం పెరుగుతుంది. పూర్తిగా ట్రామాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. అదే జరిగితే వాళ్లు రెస్క్యూ ఆపరేషన్‌కి కూడా సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇన్ని రోజుల పాటు అలా చీకటిలో ఉండడం వల్ల భయంతో గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంది. ఆక్సిజన్, కార్బన్ డైయాక్సైడ్ లెవెల్స్ కూడా వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పూర్తిగా కోమాలోకి వెళ్లే ప్రమాదముంది"
- మానసిక వైద్యులు
సహాయక చర్యలు కొనసాగుతుండగా కొండచరియలు విరిగిపడటం, డ్రిల్ యంత్రం ఫెయిల్ అవడంతో అధికారులు అధునాతన డ్రిల్లింగ్ పరికరాలను తెప్పించారు. ఈ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త డ్రిల్లింగ్ మెషీన్‌ను విమానంలో సైట్‌కు తరలించింది. అలాగే ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న నార్వే, థాయిలాండ్ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఘటనాస్థలిని కేంద్ర మంత్రి వీకే సింగ్ పరిశీలించారు. రెస్క్యూ ప్రయత్నాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిక్కుకున్న వారందరిని రక్షించడం తమ బాధ్యత అన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ.. సంస్థ రెస్క్యూ ప్రయత్నాలను నిశితంగా పరిశీలిస్తోందని, సాధ్యమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Also Read: Kulgam Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదులు హతం