World Cup 2023 For India Vs Australia Final, Ahmedabad Hotel Prices High: అసలే ప్రపంచకప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌. తలపడేది భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియతో. 2003 ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇరు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కప్పును ఒడిసిపట్టాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పదని తేలిపోయింది. మాములుగానే భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు ఆ మ్యాచ్‌ కోసం ఆసక్తికా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. మైదానంలో ఆట‌గాళ్ల క‌వ్వింపులు, ఉద్వేగ‌పూరిత క్షణాలు మ్యాచ్‌ను ఆస‌క్తిక‌రంగా మారుస్తాయి. ICC ఈవెంట్‌లలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 


క్రికెట్‌ను అమితంగా ప్రేమించే మన దేశంలో... అదీ ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో భారత్‌-ఆస్ట్రేలియా తలపడుతుంటే క్రికెట్‌ ప్రేమికులు చూస్తూ ఊరుకుంటారా.. అందుకే నవంబర్‌ 19న ఫైనల్‌ జరిగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హోటల్‌ బుకింగ్‌లు జోరందుకున్నాయి. అక్టోబరు 15న భారత్‌, పాక్‌ మ్యాచ్‌ సమయంలో అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు వాటికి డబుల్‌గా పెరిగాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు చుక్కలను తాకుతున్నాయి.  ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఒకరోజు బస చేయాలంటే అక్షరాల లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. అయినా సరే హోటల్‌ బుక్‌ చేసుకునేందుకు అభిమానులు వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం ఇక్కడ బేసిక్‌ హోటల్‌ రూమ్‌ ధరనే ఒక రాత్రికి రూ.10వేలుగా ఉంది. ఇక, ఫోర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో గది అద్దెకు తీసుకోవాలంటే ఒక రాత్రికి రూ.లక్ష వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇంకొన్ని లగ్జరీ హోటళ్లలో అయితే రూమ్‌ ఛార్జీ రూ.24వేల నుంచి ఏకంగా రూ.2,15,000కు చేరాయి. అహ్మదాబాద్‌కు విమాన టికెట్‌ ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్లలో టికెట్‌ ధరలు 200 నుంచి 300శాతం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఫైనల్‌ మ్యాచ్‌ కోసం నవంబరు 13న తుది దశ విక్రయం చేపట్టగా.. క్షణాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.


భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. కలను నెరవేర్చుకునేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో టీమిండియా ఉంది. భీకర ఫామ్‌లో  ఉన్న టీమిండియా.... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయినా ఆస్ట్రేలియన్లను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. కోట్లాది మంది క్రికెట్‌ అభిమానుల కల తీర్చడానికి, ప్రపంచకప్‌ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడేందుకు టీమ్‌ఇండియా అడుగు దూరంలో ఉంది. ఈ టోర్నీలో అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్‌ సేన సగర్వంగా ఫైనల్‌కు చేరింది. నవంబరు 19న అహ్మదాబాద్‌ స్టేడియంలో తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు.. అహ్మదాబాద్‌కు పోటెత్తుతున్నారు.