ODI World Cup 2023 Prize Money: భారత్(India) వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup 2023) తుది అంకానికి చేరుకుంది. కలను నెరవేర్చుకునేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో టీమిండియా(Team India ) ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా.... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా(Australia)తో తలపడనుంది. అయితే ప్రపంచ గెలిచే జట్టుకు ఎంత మొత్తం ప్రైజ్ మనీగా దక్కుతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విన్నర్‌కు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారు, రన్నరప్‌గా నిలిచే జట్టుకు ఎంత మొత్తం వస్తుందనేది చాలామందిలో ఉత్సుకతను కలిగిస్తోంది. అయితే విన్నర్‌కు రివార్డు కింద ఐసీసీ(ICC) కళ్లుచెదిరే మొత్తంలో ప్రైజ్‌మనీ అందజేస్తుంది. ప్రపంచకప్‌ అంతటికీ సంబంధించి పది మిలియన్ డాలర్ల(Ten Million Dollars In Rupees) ప్రైజ్‌మనీ (Prize Money) అందించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి- టోర్నీ ఆరంభానికి ముందే వెల్లడించింది. అయితే ఇది విన్నర్‌కే కాకుండా మిగిలిన జట్లకు కూడా దక్కనుంది. 


ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు.. ట్రోఫీతో పాటు 4 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ కింద దక్కనుంది. అంటే సుమారు 33 కోట్ల 17 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఇక ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే జట్టుకు 2 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీ కింద అందజేస్తారు. అంటే రన్నరప్‌గా నిలిచే జట్టుకు 16 కోట్లు ప్రైజ్ మనీ కింద ఐసీసీ అందివ్వనుంది. ఇక సెమీఫైనల్‌లో ఓడిపోయే జట్లకు.. ఒక్కొక్కదానికి 8 లక్షల డాలర్ల చొప్పున అందిస్తారు. సెమీ ఫైనల్స్‌లో ఓడిన జట్లు చెరో 6 కోట్ల రూపాయలను అందుకోనున్నాయి. గ్రూపు స్టేజి తర్వాత వెనుదిరిగే జట్టుకు లక్ష డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ కింద ఐసీసీ అందజేస్తుంది. అంటే నాకౌట్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించడంలో విఫలమైన మిగిలిన ఆరు జట్లకు తలో 82 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కనుంది. గ్రూప్ స్టేజ్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌ విజేతకు సుమారు 33 లక్షల రూపాయల ప్రోత్సాహకం లభిస్తుంది. ఇలా ప్రపంచకప్‌ టోర్నీ మొత్తానికి దాదాపు 83 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ ఖర్చు చేయనుంది. అన్నిజట్లకు వారి ప్రదర్శన ఆధారంగా ఆయా మొత్తాలు అందేలా ఐసీసీ ఏర్పాటు చేసింది.
 టోర్నీలో మరింత పోటీతత్వం నింపడంతో పాటు, ఆటగాళ్లకు అభిమానులకు వినోదభరితంగా మార్చే ప్రయత్నంలో భాగంగా...ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ తెలిపింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 న ప్రారంభంకాగా నవంబర్ 19న ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి. టోర్నీలో 45 లీగ్ మ్యాచ్‌లు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇప్పటికే రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు పూర్తి కాగా చివరి నాకౌట్‌ మ్యాచ్‌... ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 19న టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. 


ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. కళ్లముందు భారీ లక్ష్యం కనపడుతున్నా న్యూజిలాండ్ గొప్పగా పోరాడింది. అయినా భారత బౌలర్ల ముందు ఆ పోరాటం సరిపోలేదు. విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ షమీ మరోసారి జూలు విదిల్చడంతో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు.