Singer Sunitha On Her Career And Struggles: గాయనిగా రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు సునీత. తన అద్భుత గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. అయితే, తన నవ్వు వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయన్నారు సునీత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ లో ఎదుర్కొన్న ఉత్థాన పతనాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకున్న సింగర్ సునీత
చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను తన భుజాల మీదకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు సునీత. వ్యక్తిగతంగా, పర్సనల్ గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కెరీర్ ను మాత్రం వదులుకోలేదని చెప్పారు. “జీవితంలో కష్టనష్టాలు, సుఖ దు:ఖాలు కామన్. కానీ, వాటిని ఎలా తట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుంటే కన్నీళ్లు పొంగుకొస్తాయి. చాలా విషయాల్లో నమ్మిన వారి నుంచే వంచనకు గురయ్యాను. నా మీద వచ్చిన విమర్శలు, సూటిపోటి మాటల గురించి ఎంత చెప్పినా తక్కువే” అన్నారు.
35 ఏళ్లు వచ్చే వరకు సమస్యలు ఎదుర్కొన్నా- సునీత
“చిన్న వయసులో అంటే సుమారు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా కెరీర్ మొదలు పెట్టాను. 19 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబానికి నేనే దిక్కుగా ఉన్నాను. 21 ఏళ్లకు తల్లిని అయ్యాను. 24 ఏళ్లకు ఇద్దరు పిల్లలు అయ్యారు. ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరో వైపు సింగర్ గా కొనసాగాను. నాన్న చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. ఉన్న ఇళ్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. కష్టాలు ఎన్ని ఉన్నా కెరీర్ ను నిర్లక్ష్యం చేయలేదు. 35 ఏళ్లు వచ్చే వరకు కష్టాలు అనుభవించాను” అని వివరించారు.
నమ్మిన వాళ్లే మోసం చేశారు- సునీత
చాలా విషయాల్లో మోసపోయినట్లు సునీత చెప్పుకొచ్చారు. తన చుట్టూ ఉన్న వాళ్లే మోసం చేశారని చెప్పారు. “నా చుట్టూ ఉన్న వారే నన్ను చాలా సార్లు మోసం చేశారు. మోసపోయిన ప్రతిసారి బాధపడేదాన్ని. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నవ్వుతూనే ఉండేదన్నా. కొంత మంది నా నవ్వును కూడా హేళన చేసేవాళ్లు. నాదో ఫేక్ నవ్వు అంటూ విమర్శలు చేసే వాళ్లు. ఆ విమర్శలను పట్టించుకునేదాన్ని కాదు. బాధను నవ్వు రూపంలో వ్యక్తం చేసేదాన్ని. నా జీవితం గురించి ఎంతో మంది ఎన్నో విధాలుగా కామెంట్ చేసే వాళ్లు. కానీ, నేను సమాధానం చెప్పేదాన్ని కాదు. నవ్వి వదిలేసేదాన్ని. కానీ, ఒక్కోసారి వారి మాటలు విని ఏడుపు వచ్చేది. ఏడ్చేదాన్ని. మళ్లీ మర్చిపోయేదాన్ని” అని చెప్పారు.
రెండో పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం- సునీత
జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాల్లో రెండో పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం అని చెప్పారు సునీత. ఇప్పుడు తన కుటుంబ చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. విమర్శలు, కష్టాలు ఎదురైనా గట్టిగా ఎదురు నిలబడటం వల్లే తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందని చెప్పారు. ఎదుటి వారి మాటలకు బాధపడుతూ కూర్చుంటే జీవితం అక్కడే ఆగిపోయేదన్నారు.
Read Also: డ్రస్సు కారణంగా అనసూయ పాట్లు - కానీ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయకుండా - పుష్ప 2 అప్‌డేట్ కూడా!