Madhya Pradesh Election 2023: 



పలు చోట్ల ఉద్రిక్తతలు..


మధ్యప్రదేశ్‌ పోలింగ్‌లో (Madhya Pradesh Polling) పలు చోట్ల ఉద్రిక్తత ఘటనలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా గాయపడ్డారు. భింద్ జిల్లాలో జరిగిన గొడవలో ఆయనకు గాయాలయ్యాయి. ఆయన కార్ అద్దాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జబువాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బీజేపీ కార్యకర్తలే రాళ్లు రువ్వారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది గూండా రాజ్యం అంటూ మండి పడింది. చింద్వారాలోని బరారిపుర ప్రాంతంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కొడుకు, కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్‌ని పోలింగ్ బూత్ వద్ద అడ్డుకోవడం కలకలం సృష్టించింది. పోలింగ్‌ బూత్‌లోకి అడుగు పెట్టకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దిమాని నియోజకవర్గంలోనూ రెండు పోలింగ్‌ బూత్‌ల వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.