Telangana Assembly Elections 2023: యుద్ధ క్షేత్రంలోకి రాజు స్వయంగా రంగంలోకి దిగి కత్తి పడితే ఆ సైన్యం లో  ఉండే కిక్కే వేరు. అదే రాజు యుద్ధానికి ముందే కత్తి దింపితే  ఆ సైన్యం ముందే ఓటమిని అంగీకరించినట్లు ఇది యుద్ద తంత్రం. అదే పరిస్థితి తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల పరిస్థితి.  ప్రతీ రాజకీయ పార్టీకి ఎన్నికలు ఓ యుద్దం.  యుద్దంలో రాజులు రాజ్యాలు గెలిస్తే.. ఎన్నికల్లో పార్టీలు ప్రజల మనసు గెల్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. అయితే యుద్ధానికి సిద్ధమయి ఆఖరి నిమిషంలో కారణాలు  ఏమైనా కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం అస్త్ర సన్యాసం చేశాయి. ఆ పార్టీ అధినేతలు తాము ఎన్నికల్లో పోటీ చేయడం  లేదని ప్రకటించారు. అదే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. 


తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, తెలంగాణ టీడీపీ, తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధికార పార్టీగా తెలంగాణలో కీలకమైన పాత్ర పోషిస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండో స్థానం కోసం కొద్ది కాలంగా పోటీ పడ్డాయి. చివరకు కర్ణాటక ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అన్న చందంగా దూకుడుగా రాజకీయాలు నడిపిన కమలం పార్టీ కర్ణాటక ఎన్నిక ఫలితాల తర్వాత ఆ దూకుడును ప్రదర్శించలేకపోయింది. అప్పటి వరకు ఓ మోస్తరు వేగంతో సాగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కర్ణాటకలో హస్తం పార్టీ అధికారం చేజిక్కించుకోవడంతో తెలంగాణలోను అధికార పీఠం దక్కించుకునేందుకు దూకుడు పెంచారు. 


మూడు పార్టీల అస్త్ర సన్యాసం
ఇలా రెండు పార్టీలు తమదైన శైలిలో ఎన్నికలకు సిద్ధమవుతుండగా ఇక సీపీఐ, సీపీఎం పార్టీలు పొత్తుల అస్పష్టతతో ఎన్నికల వేళ కొంత గందర గోళ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. తొలుత బీఆర్ఎస్ తో పొత్తుల కోసం చూసిన వామపక్షాలకు ఆ పార్టీ చేయివ్వడంతో కాంగ్రెస్ వైపు తిరిగాయి. స్థానాల విషయంలో పొసగకపోవడంతో సీపీఎం ఈ ఎన్నికల్లో ఒంటరి ప్రయాణం చేస్తోంది. సీపీఐ కాంగ్రెస్ తో ఒక స్థానంలో పోటీకి అంగీకరించి ఎన్నికలకు సిద్ధమవుతోంది. బీఎస్పీ తన అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల్లో తన ప్రభావం చూపేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఎన్నికల ముందు వరకు హడావుడి చేసిన తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తెలంగాణ టీడీపీ పార్టీలు మాత్రం అస్త్ర సన్యాసం చేశాయి. 



బీజేపీ బీసీ మఖ్యమంత్రి హమీతో.. పోటీ నుంచి తప్పుకున్న కిషన్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే వంద స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. మోదీ, అమిత్ షా వంటి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే  ఎన్నిక ముందు పార్టీ అధ్యక్ష మార్పు జరిగింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని కమలం అధినాయకత్వం నియమించడం అనూహ్యమైన రాజకీయ పరిణామంగా చెప్పవచ్చు. ఇందుకు కారణాలపై ఇప్పటి వరకు ఎవరూ నోరు మెదపడం లేదు. అంతే కాకుండా మరో ఊహించని పరిణామం బండి సంజయ్ కరీంనగర్ నుండి పోటీ చేయాలని పార్టీ ఆదేశించడంతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ పై బండి పోటీకి సిద్ధమయ్యాడు. 


కాని ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీ నుండి ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. బీసీనే తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని అధినాయకత్వం చెప్పడంతో కిషన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమలం పార్టీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో ముందుండి నడకపోవడం పట్ల కమలం పార్టీలోను చర్చ సాగుతోంది. పార్టీ అధ్యకుడు ఎన్నికల నుండి తప్పుకోవడం పార్టీ క్యాడర్ పై ఎలాంటి ప్రబావం చూపుతుందో అన్న భయం కమలం క్యాడర్ లో నెలకొంది.


వీరి అస్త్ర సన్యాసం దేనికో..
విద్యా జీవితంలో థియరీ ఎంతో ముఖ్యమే చివర్లో ప్రాక్టికల్స్ లో పాల్గొనడం అంతే ముఖ్యం. రాజకీయాల్లోను ప్రజల్లో తిరగడం ఎంత ముఖ్యమో, ఎన్నికల్లో పోటీ చేయడం అంతే ముఖ్యం. కాని ఆచార్య కోదండరాం ఈ దఫా తెలంగాణ జన సమితి ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 2018లో మహకూటమిగా కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో పోటీ చేసిన తెలంగాణ జన సమితి పార్టీ ఈ ఎన్నికల్లో  తన అభ్యర్థులను నిలబట్టలేదు. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని ఆ పార్టీ నిర్లయించుకున్నప్పటికీ, హస్తం పార్టీతో  పోటీ చేసే స్థానాలు కుదరక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 


జహీరాబాద్, నర్సంపేట, హన్మకొండ, మంచిర్యాల వంటి 13 స్థానాల్లో పోటీ చేస్తామని  కాంగ్రెస్ కు లిస్ట్ పంపితే ఒకటి , రెండు స్థానాల్లోనే అవకాశం ఇస్తామని చెప్పడంతో తెలంగాణ జన సమితి తర్జన భర్జనలో మునిగిపోయిది.  మరో వైపు పార్టీ అధ్యక్షుడు కోదండరాం  ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రమంతా ప్రచారంలో పాల్గొనాలని తెలంగాణ జన సమితి నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ ఇచ్చే స్థానాల్లో పోటీ చేయడం కన్నా ఆ పార్టీకే మద్ధతు తెలిపి  ఎన్నికల్లో గెలిచాక ఎమ్మెల్సీ వంటి పదవులు పొందాలని నిర్ణయించుకుంది. దీంతో  తెలంగాణ జన సమితికి ఈ ఎన్నికల్లో తన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సదరు నేతలది ఆ పార్టీలో మింగలేని.. కక్కలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.


తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు


ఏపీ రాజకీయాలు వేడెక్కడం, మరో వైపు చంద్రబాబు అరెస్టు, జైల్లో గడపడం వంటి అంశాలతో కొంత డీలాపడ్డ తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న టీడీపీ నిర్ణయం షాక్ కు గురి చేసింది. అప్పటి వరకు ఎంతో కొంత తెలంగాణ టీడీపీలో  ఉన్న ఉత్సాహం కాస్తా నీరుగారిపోయింది. ఏకంగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీకి ప్రాతినిధ్యం లేనట్లయింది. అయితే ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెరవెనుక మద్ధతు ఇవ్వడంలో భాగంగానే టీటీడీపీని ఎన్నికల్లో నిలబడకుండా ఉండేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు టీడీపీ తెలంగాణ క్యాడర్ లో వినిపిస్తోంది.


షర్మిల నిర్ణయం అనూహ్యం
రాజన్న రాజ్యం తెస్తామంటూ తెలంగాణలో 2021 నుండి విస్తృతంగా పాదయాత్ర చేసిన వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు ఈ ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటూ సాగిన ప్రచారం చివరకు ఎన్నికల నుండి తప్పుకునే పరిస్థితికి దారి తీయడం ఆ పార్టీ నేతల్లో అసంతృప్తిని నింపింది.  ఒంటరిగా పోటీ అన్న షర్మిళ ఆ తర్వా కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఆపార్టీ అధినేతలతోను చర్చలు జరిపింది. కాని 2018 ఎన్నికల్లో మహకూటమిగా టీడీపీతో జట్టు కట్టడం, చంద్రబాబు  తెలంగాణ లో ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ కు లాభం కలిగిందన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిళ తో కలిసి పోటీ చేసేందుకు కాని, ఆపార్టీ విలీనం చేసుకునే విషయంలో కాని సానుకూలంగా స్పందించలేదు. తెలంగాణ రాజకీయాల కన్నా ఆంధ్ర రాజకీయాలపై దృష్టి సారించమని షర్మిళకు సూచించినట్లు సమాచారం.  ఏది అయితే ఏమి ఆ పార్టీ కాంగ్రెస్ కు మద్ధతు ప్రకటిస్తున్నట్లు పేర్కొనడంతో వైఎస్ ఆర్ టీపీ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. షర్మిళ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఈ  ఎన్నికల్లో ఆ పార్టీ తన ఉనికిని చాటుకునే పరిస్థితిని కోల్పోయింది. 


చివరి నిమిషంలో బరిలో జనసేన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికగా రాజకీయాలు చేసిన జన సేన చివరి నిమిషంలో తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా బరిలో దిగింది. బీజేపీతో కలిసి  పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. సెటిలర్స్ ఓటర్లే లక్ష్యంగా హైదరాబాద్, ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 32 స్థానాల్లో జన సేన పోటీకి సిద్ధమని చెప్పినా 9 స్థానాల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు సీట్ల పంపకాలపై చర్చలు సాగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రధాన పార్టీలుగా చెలమణి కావాలనకున్న  పార్టీలు అస్త్ర సన్యాసం చేస్తే, ఏపీ వేదికగా రాజకీయం చేస్తోన్న జన సేన మాత్రం తెలంగాణ ఎన్నికల బరిలో దిగడం వైచిత్రం.


- వై. సుధాకర్ రావు, ఇన్ పుట్ ఎడిటర్