Raithu Bharosa Funds: రాష్ట్రంలో ఈ ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున రూ.2,204 కోట్లను 53.53 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో వేశారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా  రైతు భరోసా కింద రూ.13,500 రైతు భరోసా సాయం అందిస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.33,209.81 కోట్లు రైతన్నలకు అందించినట్లు సీఎం జగన్ తెలిపారు.


ఐదో ఏడాది ఇప్పటికే మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం అందించిన జగన్‌ సర్కార్‌... ఇవాళ రెండో విడతగా రూ.4,000 అందించింది. వైఎస్సార్ రైతు భరోసా-సీఎం కిసాన్‌ కింద... ఏటా 3 విడతల్లో రూ.13,500 అందిస్తోంది. ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్- నవంబర్ నెల ముగిసే లోపే ఖరీఫ్ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి - ఫిబ్రవరి నెలలో రూ.2,000 అందిస్తోంది. 


చంద్రబాబుపై విమర్శలు


చంద్రబాబు హయాంలో పేదల గురించి ఆలోచించలేదన్నారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కామేనని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ముందుగా నిధులు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. చంద్రబాబు హయాంలో ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారాయన. స్కీమ్‌ల గురించి కాకుండా... స్కాముల గురించి చంద్రబాబు ఆలోచించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం... ఏ రంగంలో అయినా... కనీ వినీ ఎరుగని మార్పులు తెచ్చామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కూడా తెచ్చామన్నారు.


వైసీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం, ఉచిత పంట బీమా ఇస్తున్నామన్నారు. రైతులపై భారం లేకుండా పూర్తి ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని బీమా రక్షణ అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో బీమా క్లెయిమ్లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో. ఎంతమందికి వస్తాయో కూడా తెలియని దుస్థితి ఉండేదన్నారు. ప్రీమియం సైతం రైతు చెల్లించాల్సి వచ్చేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంట నష్ట పరిహారం ఈ-క్రాప్ డేటా ఆధారంగా శాస్త్రీయంగా పంట నష్టాలు అంచనా వేసి ఏ సీజన్ పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నామని చెప్పారు.  మీ ఇంట్లో మేలు జరిగి ఉంటే.. మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు.