Chandrababu News : ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి  ఆపరేషన్ పూర్తయింది. 45 నిమిషాల్లో ఎల్వీప్రసాద్ వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నుంచి కాన్వాయ్‌లో టీడీపీ చీఫ్ ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు.  జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ జరుగగా..  ఇప్పుడు కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది.  ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు.


జైల్లో చంద్రబాబుకు పెరిగిన  ఆరోగ్య సమస్యలు 


స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో జైల్లో కనీస సౌకర్యాలు లేకపవడంతో ఆరోగ్య సమస్యలు వచ్చాయి.  బరువు తగ్గారు. ఆయనకు మొదటి నుంచి చర్మ సంబంధిత సమస్య ఉంది. జైల్లో విపరీతమైన ఉక్కపోత కారణంగా ఆ సమస్య మరింత పెరిగింది. అయితే వ్యక్తిగత వైద్యుడిత చికిత్స అందించేందుకు జైలు వర్గాలు నిరాకరించాయి. చివరికి కేటరాక్ట్ ఆపరేషన విషయంలోనూ ప్రభుత్వ వైద్యుడితో ఉదయం ఒకలా.. సాయంత్రం మరోలా నివేదికలు ఇప్పించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ.. హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్ నాలుగు వారాల పాటు ఇచ్చారు. 


ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్సలు   


తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆయన   హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు పరీక్షలు చేయించుకున్నారు. ఓ రోజు ఆస్పత్రిలోనే అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత  ఏఐజీకి వచ్చిన చంద్రబాబు ఒకరోజు ఇక్కడే ఉండి పలు వైద్యపరీక్షలు చేయించుకున్నారు.  చర్మ సంబంధిత సమస్యపై చికిత్స చేసినట్లుగా తెలుస్తోంది. వైద్య పరీక్షల ఫలితాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన  కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. 


చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్న సీఐడీ                                                                     


మరో వైపు చంద్రబాబుపై ఏపీ సీఐడీ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తన్నారు. ఓ సారి మద్యం కేసు.. మరోసారి ఇసుక కేసు.. ఇలా కేసులు పెడుతూనే పోతున్నారు. వాటన్నింటిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తనను అరెస్టు  చేయడానికి ఎన్నికల సన్నాహాలు దెబ్బతీయడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుదంని.. గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని వాదిస్తూ.. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తయింది. రెండు, మూడు రోజుల్లో తీర్పు రావాల్సి ఉంది. ఆ కేసుల్లో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఈ కేసులన్నీ చట్ట విరుద్ధమవుతాయి.