రాష్ట్రంలో ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, ఆర్మూర్ లో కార్నర్ మీటింగ్ కు శుక్రవారం రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని చెప్పారు. తాను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడకు రాలేదని వెల్లడించారు.
ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి వచ్చా తెలంగాణకు వచ్చినట్లు చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించామని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ. 2500 అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని చెప్పారు. పసుపు రైతులకు క్వింటాకు రూ.12వేలు ధర కల్పిస్తామని స్పష్టం చేశారు. గృహ జ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.
కేసీఆర్ మీ నుంచి దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో మళ్లీ మీకే పంచుతామన్నారు. తెలంగాణలో దొరలపాలనను సాగనంపి... ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలతో తనకు ఉన్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోందని చెప్పారు.
మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్ లల్లో కాంగ్రెస్ ఎక్కడ బీజేపీ తో యుద్ధం చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై కేసులు పెట్టారని చెప్పారు. అంతేకాకుండా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారన్నారు. ఎంపీగా తనకు కేటాయించిన ఇల్లును కూడా లేకుండా చేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. తనకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణలో ప్రజల గొంతు వినిపిస్తుందనుకున్నాం కానీ దొరల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదని చెప్పారు.
తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీ నుంచి దోచుకున్న సొమ్మునంతా మీకు అందేలా చూస్తానాని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు బాల్కొండ నియోజకవర్గానికి ముత్యాల సునీల్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గానికి వినయ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
మోర్తాడ్ నుంచి ఆర్మూర్ వెళ్లే దారిలో పడగల్ వద్ద ఓ టీ కొట్టు వద్ద ఆగిన రాహుల్ గాంధీ టీ అమ్ముకుంటున్న వృద్ధురాలి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీకొట్టు యజమాని కుటుంబంలోని చిన్నారులతో సరదాగా సంభాషించారు. వారికి చాక్లెట్లు పంచారు. సోనియమ్మ కొడుకు, ఇందిరమ్మ మనుమడు నువ్వేనా అంటూ రాహుల్ ను ఆప్యాయంగా వృద్ధ దంపతులు పలకరించారు.
కాంగ్రెస్ లో చేరిక
ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖా నాయక్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ముగిసిన బస్సు యాత్ర
తెలంగాణ లో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగిసింది. 3 రోజులపాటు సాగిన బస్ యాత్ర కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ బస్ యాత్రను ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర ములుగు నియోజకవర్గ నుంచి ఆర్మూర్ వరకు సాగింది. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, మోర్తాడ్, ఆర్మూర్ నియోజక వర్గాలల్లో కొనసాగింది. యాత్ర ముగిసిన అనంతరం ఆర్మూర్ నుంచి హైదరాబాద్ కు రోడ్ మార్గంలో రాహుల్ గాంధీ వెళ్లారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.