ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగిపోయారు. పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. అది అలాగా ఇలాగా కాదు. బౌండరీలు, సిక్సులకు సిగ్నల్స్‌ ఇస్తూ అంపైర్లు అలసిపోయేలా... బౌండరీని దాటిన బంతిని తెచ్చితెచ్చి పాకిస్థాన్‌ ఆటగాళ్లను నిస్సత్తువ ఆవహించేలా చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమైన బౌలింగ్‌ దళంగా పేరొందిన పాక్‌ బౌలర్లు బంతులు వేయాలంటేనే భయపడిపోయేలా చేశారు. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెటుకున్నారు. వీరి ధాటికి స్కోరు బోర్డు హై స్పీడ్‌తో పరుగు పెట్టింది. డేవిడ్‌ వార్నర్‌ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. వార్నర్‌, మిచెల్ మార్షల్  విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి  367పరుగులు చేసింది.
  

 

ఈ కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ బౌలింగ్ తీసుకున్నాడు. ఇది ఎంత పెద్ద తప్పు నిర్ణయమో కాసేపటికే బాబర్‌కు అర్ధమైంది. కంగారు ఓపెనర్లు పాక్ బౌలర్లను మాములుగా కంగారెత్తించలేదు. ప్రారంభంలో డేవిడ్‌ వార్నర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పాక్‌ జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకుంది. దాని తర్వాత వార్నర్‌, మిచెల్‌ ఏ పాక్‌ బౌలర్‌ను విడిచిపెట్టలేదు. హరీస్‌ రౌఫ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్‌ బ్యాటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక  విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్‌ పడకుండా బ్యాటింగ్‌ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 

మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌ ఇద్దరు పాక్‌ బౌలర్లను చితక్కొట్టి శతకాలు నమోదు చేశారు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌ మార్ష్‌  10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. ఇంకా బాదితే బాగుండదేమో అని చివరికి షహీన్‌ షా అఫ్రిదీ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌ అవుటయ్యాడు.  స్కోరు 33 ఓవర్లకే 260 పరుగులకు చేరడంతో పరుగుల వేగాన్ని మరింత పెంచేందుకు స్మిత్‌ స్థానంలో మ్యాక్స్‌వెల్‌  వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ షహీన్‌ షా అఫ్రీదీ బౌలింగ్‌లో తొలి బంతికే వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన అఫ్రీదీ పాక్‌కు కొంచెం ఉపశమనం కల్పించాడు.

 

స్టీవ్‌ స్మిత్‌ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న స్మిత్‌....  ఏడు పరుగులు చేసి స్పిన్నర్‌ ఉసామా మీర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు పడుతున్నా వార్నర్‌ మాత్రం పోరాటం ఆపలేదు. వరుసగా మూడు వికెట్లు పడడంతో కొంచెం వేగం తగ్గించి సింగల్స్‌పై దృష్టి పెట్టాడు. డేవిడ్‌ వార్నర్‌ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. వార్నర్‌, మిచెల్ మార్షల్  విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 367 పరుగులు చేసింది. అయితే ఆస్ట్రేలియా 400 పరుగులు చేస్తుంది అనుకున్నప్పటికీ చివరిలో వరుసగా వికెట్లు పడిపోవడంతో అది సాధ్యం కాలేదు. 

 

మొత్తానికి ఆస్ట్రేలియా ఓపెనర్ల ధాటికి పాక్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రపంచకప్‌లో ఇప్పటికే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్‌ మరోసారి అలాంటి అద్భుతమే చేస్తుందేమో చూడాలి.  368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్‌లో నవ చరిత్రను పాక్ సృష్టిస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పటిష్టమైన కంగారు బౌలర్లను ఎదుర్కొంటూ అంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత తేలిక కూడా కాదు.