స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ రోహిత్‌ సేన ఘన విజయాలు సాధించింది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన రోహిత్‌ సేన అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పూర్తిగా ఏకపక్ష విజయాలు సాధించి సెమీస్‌ దిశగా పయనిస్తోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఈ నెల 22న పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని రోహిత్ సేన పట్టుదలో ఉంది. అయితే 22న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ తర్వాత 29వ తేదీ వరకు టీమిండియాకు మరో మ్యాచ్ లేదు. అంటే వారం రోజుల పాటు ప్రపంచకప్‌లో భారత్‌కు మరో మ్యాచ్‌ లేదు. అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో టీమిండియా ఆడుతుంది. న్యూజిలాంట్‌తో మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు మధ్య వారం రోజులు గడువు ఉండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 



 అక్టోబర్‌ 22న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. కివీస్‌తో మ్యాచ్‌ అనంతరం భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉందని, అందుకే టీమిండియా ఆటగాళ్లను  రెండు మూడు రోజులపాటు ఇంటికి పంపించాలనే ఆలోచనలో ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్లు మళ్లీ ఫుల్‌ జోష్‌తో తిరిగి బరిలోకి దిగేందుకు ఈ విశ్రాంతి సమయం ఉపయోగపడుతుందని వెల్లడించాడు. ఇంటికి వెళ్లి వచ్చిన వెంటనే ప్రాక్టీస్ సెషన్స్‌ను ఏర్పాటు చేసి మళ్లీ క్రికెట్‌ మూడ్‌లోకి వచ్చేలా చేయాలని బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. ఆసియా కప్‌ నుంచి భారత క్రికెటర్లు బిజీ షెడ్యూల్‌తో గడిపేస్తున్నారు. అక్టోబర్‌ 29న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆటగాళ్లంతా లఖ్‌నవూకు చేరుకొని ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.



 మరోవైపు భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలర్లు సమష్టి ప్రదర్శన... బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎదురేలేకుండా పోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో.. రోహిత్ సేన ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్ సచిన టెండూల్కర్‌ రికార్డుకు మరింత చేరువయ్యాడు. మరొక్క సెంచరీ చేస్తే వన్డేల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. క్రికెట్ లెజెండ్‌ సచిన్ 463 వన్డేల్లో 49 శతకాలు చేయగా.. కోహ్లీ 285 మ్యాచ్‌ల్లోనే 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. బంగ్లాదేశ్‌పై శతకంతో వన్డేల్లో సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్‌ మరింత చేరువగా వచ్చాడు. 



 బంగ్లాతో విజయం తర్వాత పాయింట్ల పట్టికలో భారత జట్టు 4 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. భారత్, న్యూజిలాండ్‌లు చెరో ఎనిమిది పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే కివీస్‌ జట్టు నెట్ రన్ రేట్ భారత్ కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అక్టోబర్ 22న ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వంటి జట్లతో భారత జట్టు ఆడనుంది.