KCR Speech: కాంగ్రెస్ వల్లే పదేళ్లు ఆలస్యంగా తెలంగాణ, వాళ్ల అహంకారమేంటో అర్థం కాట్లేదు - కేసీఆర్

Advertisement
ABP Desam Updated at: 13 Nov 2023 04:08 PM (IST)

Khammam News: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.

దమ్మపేట సభలో సీఎం కేసీఆర్

NEXT PREV

KCR Speech in Dammapet: తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీనే అణచివేసిందని సీఎం కేసీఆర్ (KCR) విమర్శించారు. ఎప్పుడో 2004లో ఇవ్వాల్సిన ప్రత్యేక తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేసి 2014లో ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారని చెప్పారు. ఖమ్మం (Khammam News) జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు.

Continues below advertisement


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని ఆగం ఆగం కావొద్దని అన్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి గుణగణాలు కూడా ప్రజలు పరిశీలించాలని, ఆయన ఉన్న పార్టీ విధానాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ (KCR) సూచించారు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతూ.. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో మంచి చెడుల గురించి ఆలోచించాలని.. ఎన్నికల్లో నేతల కన్నా ప్రజలు గెలవడమే ముఖ్యమని అన్నారు. పార్టీ వెనుక ఉన్న చరిత్ర కూడా చూడాలని ప్రజలకు హితవు పలికారు. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదని అన్నారు.



టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని చెబుతున్నాడు. కాంగ్రెస్‌ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.  ఆ కరెంట్‌తో ఒక్క ఎకరానికైనా నీరు పారుతుందా? ఆయన అహంకారం ఏంటో అర్థం కావట్లేదు. మీకు 24 గంటల కరెంట్‌ కావాలా? 3 గంటల కరెంట్‌ కావాలా? తేల్చుకోండి. అధికారం ఇస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని పదే పదే చెప్తున్నారు. కాంగ్రెస్‌ వస్తే ధరణిని తీసేస్తారు-


ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగిందని సీఎం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం (Khammam Politics) జిల్లా పచ్చగా అవుతుందని అన్నారు. గతంలో రైతుల్ని ఆదుకోవాలని ఏ ప్రభుత్వం అనుకోలేదని.. వారికి కనీస అవసరమైన విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వలేదని గుర్తు చేశారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా అక్కడి బీజేపీ ప్రభుత్వం 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదని అన్నారు. ‘‘నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేనట్లుగా రైతుల కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చుకున్నాం. రైతు చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలను వారం రోజుల్లోనే చెల్లింపు చేస్తున్నాం. ధరణితోనే రైతు బంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ధరణితో రైతులకే యాజమాన్య హోదా ఇచ్చాం. అలాంటిది ధరణిని తీసేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది’’ అని కేసీఆర్ (KCR) మాట్లాడారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని కేసీఆర్ (KCR) ప్రజలకు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఒడుదొడుకులు లేవని, ఎలాంటి అలజడులు కూడా లేవని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తూనే.. అది కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తోందని అన్నారు. 

Published at: 13 Nov 2023 04:01 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.