కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) పెద్ద భూకబ్జాదారు అని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదని.. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు అని ఎద్దేవా చేశారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను రూ.50 లక్షల డబ్బుల బ్యాగుతో కొంటూ పట్టుబడ్డారని గుర్తు చేశారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లో చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు. 


ఎవరికి వారు నేనే సీఎం అని కాంగ్రెస్ లో దాదాపు 15 మంది తిరుగుతూ ఉంటారని అన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే కదా.. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యేదని అన్నారు. రేవంత్‌ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్‌ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని అన్నారు. కొడంగల్‌లో పనులన్నీ చేసి పెట్టే నరేందర్‌ రెడ్డి కావాలా? ఉత్త మాటలు చెప్పే రేవంత్‌ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలని పిలుపు ఇచ్చారు.


తాండూర్‌లోనూ సభ
కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇప్పుడు అక్కడ కేవలం రోజుకి 5 గంటల వ్యవసాయ కరెంటు మాత్రమే ఇస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అదే పరిస్థితి ఇక్కడి రైతులకు ఎదురవుతుందని అన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ ను ఎత్తేసి మ‌ళ్లీ ప‌ట్వారీలు, పాత క‌థ‌నే వ‌స్తదని.. మ‌ళ్లీ ద‌ళారి రాజ్యమే వస్తుందని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డికి మ‌ద్దతుగా ఆయనకు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు.


తాండూరు వెనకబడిన ప్రాంతం అని.. కాంగ్రెస్ పాల‌న‌లో అస్సలు బాగుపడలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. క‌నీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా.. తాండూరు ప్రజ‌లు కాగ్నా న‌ది వ‌ద్ద గుంత‌లు తీసి నీటిని తోడుకొని వ‌డ‌క‌ట్టుకొని నీళ్లు తాగే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు మిష‌న్ భ‌గీర‌థ‌తో ప్రతి తండాలో, చిన్న ఊరిలో కూడా ప‌రిశుద్ధమైన నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు.


టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే రోడ్లు బాగు చేసుకున్నామని.. చెక్ డ్యాంలు క‌ట్టుకున్నామని అన్నారు. మైన‌ర్ ఇరిగేష‌న్ కింద ఎన్నో చెరువులు బాగు చేసుకున్నట్లుగా చెప్పారు. ఫలితంగా తాండూరులో భూగ‌ర్భ జ‌లాలు పెరగడమే కాకుండా.. పంటలు కూడా బాగా పండుతున్నాయని అన్నారు. ఇక్కడ జరిగిన డెవలప్ మెంట్ మొత్తం ప్రజల కళ్ల ముందే ఉందని, నేను అమెరికా కథ చెప్పడం లేదని అన్నారు. ఈ ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ఏం జ‌రిగిందో.. 50 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఏం జ‌రిగిందో ప్రజలు పోల్చి చూసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.