World Billiards Championship:  భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. పది కాదు.. ఇరవై కాదు.. ఇరవై ఆరు సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 1000-416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారీని ఓడించి.. పంకజ్‌ అద్వాణీ 26వ సారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ టైటిల్‌తో మరోసారి ప్రపంచ బిలియర్డ్స్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో 2003లో తొలిసారిగా విజేతగా నిలిచిన అద్వాణీ.. టైటిల్‌ నెగ్గడం ఇది 26వసారి. అంతకుముందు సెమీస్‌లో అడ్వాణీ 900-273తో రూపేశ్‌ షాపై తిరుగులేని ఆధిపత్యంతో గెలిచాడు. ఈ పోటీలలో ప్రథమ స్థానంతో పాటు ద్వితీయ, తృతీయ స్థానాలను కూడా భారత ఆటగాళ్లే గెలుచుకున్నారు. పంకజ్‌ అద్వాణీ సుదీర్ఘ ఫార్మాట్‌లో తొమ్మిది సార్లు టైటిల్‌ను గెలుచుకున్నాడు. గతంలో పంకజ్‌ పాయింట్ల ఫార్మాట్‌లో 8 సార్లు...లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు... స్నూకర్‌లో 8 సార్లు... టీమ్‌ ఫార్మాట్‌లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.



 పంకజ్ అద్వానీ కెరీర్ అద్భుతంగా సాగుతోంది. 1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పంకజ్‌.. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. 2005లో IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.  గ్రాండ్‌ డబుల్‌ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి.. భారత్‌కు బంగారు పతకాన్ని అందించాడు. 2010 ఆసియా క్రీడల్లో సింగిల్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. 2006 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించాడు. 17 బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్స్, IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను 16సార్లు గెలిచాడు. IBSF ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ను మూడుసార్లు, IBSF వరల్డ్ సిక్స్-రెడ్ ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు, IBSF వరల్డ్ టీమ్ కప్, IBSF వరల్డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లను ఒక్కొక్కసారి గెలుచుకున్నాడు.


 పంకజ్‌ అద్వాణీ చైనాలోని జియాంగ్‌మెన్‌లో 2003 అక్టోబర్ 25 న IBSF ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ను 18 ఏళ్ల వయసులో గెలుచుకున్నాడు. ఈ టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఖ్యాతి గడించాడు. ఇదే పంకజ్‌ అద్వాణీకి మొదటి ప్రపంచ టైటిల్. 28 ఏళ్ల వయస్సులో ఈజిప్ట్‌లో జరిగిన IBSF వరల్డ్ 6-రెడ్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌ గెలిచాడు. 2015లో పాకిస్తాన్‌లోని కరాచీలో టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుని రికార్డు సృష్టించాడు. 


పంకజ్ అద్వాణీ పుణేలో 1985 జులై 24 జన్మించాడు. 2018లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. పంకజ్‌కు 2009లో పద్మశ్రీ, 2004లో అర్జున అవార్డు, 2005లో ఖేల్‌ రత్న అందుకున్నారు. 2018లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. 2007లో కర్ణాటక రెండో అత్యున్నత పురస్కారమైన రాజ్యోత్సవ ప్రశస్తిని పంకజ్‌ అందుకున్నాడు. అదే  సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం కెంపేగౌడ అవార్డు అందించింది. 2007లోనే కర్ణాటక అత్యున్నత క్రీడా పురస్కారం ఏకలవ్య అవార్డును పంకజ్‌ అద్వాణీ స్వీకరించాడు. 2005లో విజన్ ఆఫ్ ఇండియాస్ సంస్థ ఇంటర్నేషనల్ ఇండియన్ అవార్డు బహూకరించగా... అదే ఏడాది సీనియర్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని పంకజ్‌ అద్వాణి అందుకున్నాడు. 2005లో  స్పోర్ట్స్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు అవార్డు, అదే ఏడాదిలో బెంగుళూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, 2004లో హీరో ఇండియా స్పోర్ట్స్ అవార్డ్, అదే ఏడాది రాజీవ్ గాంధీ అవార్డు, 2003లో ఇండో-అమెరికన్ యంగ్ అచీవర్స్ అవార్డ్, ఆ సంవత్సరంలోనే ది స్పోర్ట్స్ స్టార్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలను పంకజ్‌ అద్వాణి అందుకున్నాడు.