Tasty Coriander Rice Recipe : కొత్తిమీర కూరల్లో వేసుకున్నా.. పచ్చడి చేసుకున్నా.. దాని టేస్ట్ వేరే లెవల్​ ఉంటుంది. అలాంటిది కొత్తిమీరతో తయారు చేసుకున్న రైస్​ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఈసారి లంచ్​కి కొత్తిమీర రైస్ ట్రై చేయండి. ఎన్నో ఆరోగ్య గుణాలున్నా ఈ ఫుడ్​ని తయారు చేయడం చాలా తేలిక. పైగా ఈ రైస్​ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాదండోయ్ మీరు బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారా? అయితే కొత్తిమీర రైస్ మీరు బరువు తగ్గేందుకు మంచి ఎంపిక. దీనిలోని గుణాలు మీరు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. మరి ఈ రుచికరమైన రైస్​ను ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బ్రౌన్ రైస్ - 30 గ్రాములు


కొత్తిమీర - 6 కట్టలు


పచ్చిమిర్చి - 3


ఉప్పు - తగినంత


నూనె - అర టీస్పూన్


ఆవాలు - అర టీస్పూన్


మినపప్పు - 5 గ్రాములు


శెనగపప్పు - 10 గ్రాములు


కరివేపాకు - 1 రెబ్బ


నీళ్లు - 2 కప్పులు 


తయారీ విధానం


ముందుగా బియ్యం, శెనగ పప్పు, మినపప్పును ఓ గిన్నెలో వేసుకుని దానిని కడిగి.. రెండు కప్పుల నీటిలో 15 నిమిషాలు నానబెట్టండి. ముందుగా కొత్తిమీరను కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. దానిలో ఉప్పు, నూనె, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దానిలో నూనె వేసి తాళింపు దినుసులతో తాళింపు వేయండి. అనంతరం కొత్తిమీర పేస్ట్ వేయండి. దానిలోని నీరు కాస్త ఆవిరి అవుతుండగా.. నీరు వేసి.. మరిగించండి. దానిలో నానబెట్టిన బియ్యం వేసి.. ఉప్పు వేసి బాగా కలిపండి. ఇప్పుడు మూతను పెట్టి.. రెండు, మూడు విజిల్స్ వచ్చేలా చూడండి. అంతే వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ. 


ఈ సులభమైన, టేస్టీ రైస్​ను మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్​ మాత్రమే కాదండోయ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని లినోలిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వాంతులు, వికారం, కడుపు సమస్యలను దూరం చేస్తాయి. దీనిలో వినియోగించే బ్రౌన్ రైస్​ కూడా గుండె ఆరోగ్యానికి చాలామంచిది. దీనిలోని పీచు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. ఇది క్రమంగా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. 


Also Read : గుండె జబ్బులను దూరం చేసి.. మధుమేహాన్ని అదుపులో ఉంచే లడ్డూల రెసిపీ ఇదే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.