Rajnath Singh Hyderabad Visit : దివంగత సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌ లతో కలిసి శుక్రవారం రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు.  కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, హీరో ప్రభాస్‌ను ఆయన పరామర్శించారు. కృష్ణంరాజు మృతిపై తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కృష్ణంరాజు అనారోగ్యానికి కారణాలు, ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్‌ వివరించారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు ఆయన ధైర్యం చెప్పారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు. 






పొలిటికల్ కెరీర్


టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూశారు (Krishnam Raju Passes Away). ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. తెలుగు వెండితెరపై హీరోగా ప్రేక్షకులను మెప్పించిన కృష్ణంరాజు.. అనంతరం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా చేశారు. దక్షిణాదిన ఓ రాష్ట్ర గవర్నర్ గా సైతం ఆయనను నియమిస్తారని ప్రచారం కూడా జరిగింది. 1970, 1980లలో కృష్ణంరాజు కెరీర్ ఓ రేంజ్‌లో సాగిపోయింది. అనంతరం ఆయన రాజకీయాలవైపు మొగ్గుచూపారు. కృష్ణంరాజు 1991లో మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. 1998లో రీ ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.


ఓడిన చోటే విజయం


పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలిరోజుల్లో పోటీ చేసి ఓడిన స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగి విజయం సాధించారు కృష్ణంరాజు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ నుంచి బరిలోకి దిగిన కృష్ణంరాజు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుతంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మరోసారి నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణంరాజు కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న రెబల్ స్టార్ రూట్ మార్చారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో 2009లో చేరారు. రాజమండ్రి నుంచి టికెట్ దక్కడంతో లోక్‌సభకు పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం, అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కృష్ణంరాజు పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. 2014లో మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. 


Also Read : Delhi Liquor Scam: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు, నేడు ఏం తేలనుంది !