ఫెరారీ కంపెనీ తన సరికొత్త హైబ్రిడ్ సూపర్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర అక్షరాలా రూ. 5.40 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇంతకీ ఈ కారులోని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డిజైన్ ఎలా ఉందంటే?
ఫెరారీ కార్లు చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. అదిరిపోయే డిజైన్ తో ఆకట్టుకుంటాయి. తాజా ఫెరారీ 296 జిటిబి సూపర్ కారు సైతం కట్టిపడేసే డిజైన్ ను కలిగి ఉంది. ఫెరారీ 296 GTB బ్రాండ్ లైనప్ లో F8 ట్రిబ్యూటో ప్లేస్ లో కొనసాగుతున్న ఈ కారు.. తక్కువ వీల్ బేస్ ను కలిగి ఉంది. డిజైన్ మాత్రం దాదాపు ఫెరారీ 250 LM లాగే ఉంది. ఈ కారులో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మిడ్ ఇంజిన్ స్పోర్ట్స్ కారులో మొదటి సారిగా.. ఫెరారీ యాక్టివ్ స్పాయిలర్ ను యూజ్ చేసింది. దీని మూలంగా కారుకు సూపర్ లుక్ వచ్చింది. ఈ సరికొత్త కారు హెడ్ లైట్ స్టైల్ టియర్ డ్రాప్ మాదిరిగా ఉంది. సైడ్ ప్రొఫైల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులోని గేర్ షిఫ్ట్ సెలెక్టర్ ఫెరారీ క్లాసిక్ H-గేట్ డిజైన్ కు గుర్తుగా రూపొందించబడింది.
ఇంటీరియర్
ఫెరారీ 296 GTB యొక్క పరిమాణం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సూపర్ కారు యొక్క పొడవు సుమారు 5.5 మీటర్లు కాగా.. వెడల్పు సుమారు 2 మీటర్లు.. ఎత్తు సైతంసుమారు 2 మీటర్లను కలిగి ఉంది. వీల్ బేస్ 20 ఇంచుల వరకు ఉంటుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపలి భాగంలో ఎక్కువ భాగం డ్యూయల్ టోన్(ఎరుపు, నలుపు) ఫినిషింగ్ లో ఉంటుంది. ఇందులోని ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టి ఉంటుంది. సీట్లు కూడా ఎరుపు, నలుపు బ్లాక్ థీమ్ ను కలిగి ఉంటాయి.
ఇంజిన్ ప్రత్యేకత
సరికొత్త ఫెరారీ 296 జిటిబి లో ట్విన్ టర్బో 3.0 లీటర్ V6 హైబ్రిడ్ పవర్ ట్రైన్ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ తో కలిపి ఇంజిన్ 830 బిహెచ్‌పి పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 167 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఎఫ్1 డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఫెరారీ 296 జిటిబి నాలుగు డ్రైవింగ్ మోడ్ లను కలిగి ఉంటుంది. ఇ-డ్రైవ్, హైబ్రిడ్, పెర్ఫార్మెన్స్, క్వాలిఫై మోడ్స్. ఈ డ్రైవింగ్ మోడ్స్ విభిన్న పవర్ ఫిగర్ లను అందించడమే కాకుండా రీజెనరేటివ్ బ్రేకింగ్ ను కలిగి ఉంటాయి.
ఇక ఫెరారీ 296 జిటిబి గరిష్ట వేగం గంటకు 330 కిమీ వరకు ఉంటుంది. కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ వరకు వేగాన్ని అందుకుంటాయి. ఈ హైబ్రిడ్ సూపర్ కార్ మొత్తం ఎలక్ట్రిక్ పరిధి 25 కి.మీ మాత్రమే కావడం విశేషం.
Also Read: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి