Minister Srinivas Goud: తెలంగాణలో సంచలనమైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) హత్యకు కుట్ర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి తనను ఆర్థికంగా దెబ్బతీశారనే కోపంతో హత్యకు పథకం(Murder Plan) వేశామని రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్య కుట్ర వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంచింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల హత్య కుట్ర కోణం బయట పడటంతో రెండు పైలట్ వాహనాలు, 20 మందితో మంత్రికి భద్రత కల్పించాలని సెక్యూరిటీ వింగ్ అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్(Remand Report)లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
రూ. 15 కోట్లకు డీల్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం దిల్లీ(Delhi) పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ కు తిరిగి రాగానే అదనపు భద్రతా కల్పిస్తారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు రూ.15 కోట్లకు డీల్ చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు(Police) అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తనను ఆర్థికంగా దెబ్బతీసినందుకు మంత్రి హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన వ్యాపారాలను మూసివేయించారని, ఆర్థికంగా దెబ్బతీశారని రాఘవేంద్రరాజు పోలీసులు తెలిపారు.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల్ని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల పాటు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును వేర్వేరు కోణాల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమను వేధించారని పోలీసులకు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏ1 రాఘవేంద్రరాజు తాను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో పోలీసులకు వివరించాడు. రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న నిందితులు మున్నూరు రవి, యాదయ్య కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బాధితులమేనని పోలీసులకు వెల్లడించారు. నిందితులకు, శ్రీనివాస్ గౌడ్‌కు మధ్య విభేదాలు కారణమని తెలుస్తున్నా, నిందితులకు బీజేపీ(Bjp) నేతలకు మధ్య సంబంధాలు ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కొంత మంది బీజేపీ నేతల పేర్లు తెరపైకి రావడంతో రాజకీయంగానూ రచ్చ మొదలైంది.
Also Read: Murder Sketch Politics : తెలంగాణ పోలీసులపై ఢిల్లీలో కేసులు - "మర్డర్ స్కెచ్" కేసులో కీలక మలుపు !