వరి ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ కమిషనర్ కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామని వస్తే అధికారులు ఎక్కడా కనిపించడంలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ భారీ నిరసన చేశారు. హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయ కమిషనరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు.. జేఏసీ(జాయింట్ ఆక్టింగ్ కమిటీ)గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామన్నా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించకపోవడం సిగ్గు చేటు అన్నారు.  సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ధర్నా చేయడంలేదని ఎద్దేవా చేశారు. ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే రైతుల వద్దకెళ్లి ధర్నా చేయాలన్నారు. 






Also Read: కేంద్ర ప్రభుత్వాన్ని సాఫ్ సీదా అడుగుతున్నం.. వడ్లు కొంటరా? కొనరా?.. కేసీఆర్ సూటి ప్రశ్న


ధైర్యముంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి


బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేసీఆర్ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల తీరు అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో ఉందన్నారు. ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేసి ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సహారా కుంభకోణంలో కేసీఆర్ ను కేంద్రమే కాపాడుతుందని రేవంత్ ఆరోపించారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయన్నాయని, ఈ సమావేశాల్లో కేసీఆర్ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. కేసీఆర్ కు ధైర్యముంటే ధాన్యం కొనుగోలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.


Also Read: ఈ యుద్ధం ఆరంభమే.. అంతం కాదు, ఇక ఉప్పెనలాగా.. అవసరమైతే వాళ్లనీ కలుపుకుపోతాం: కేసీఆర్


ప్రతీ గింజ కొనే వరకు ఉద్యమం


ముందు ఖరీఫ్ ధాన్యం కొంటారా లేదో చెప్పకుండా యాసంగి పంట గురించి ధర్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదానీ, అంబానీల కోసమే ప్రధాని మోదీ సర్కార్ పనిచేస్తోందని విమర్శించారు. రేపటి నుంచి కల్లాలోకి కాంగ్రెస్ ఉద్యమం చేపడతామన్నారు. 23వ తేదీ వరకు కల్లాల్లో  కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడతామన్నారు. తాను కామారెడ్డి కల్లాల్లోకి వెళ్లి రైతులతో కలిసి ధర్నా చేస్తానన్నారు. 23వ తేదీ వరకు సీఎం కేసీఆర్ కు సమయం ఇస్తున్నామని అప్పటికీ రైతుల సమస్యలపై స్పష్టం ఇవ్వకపోతే 23వ తేదీ తర్వాత రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కొనే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదని రేవంత్ స్పష్టం చేశారు. ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామన్నారు. 


Also Read:  బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోం... ఆ కారణంతోనే పంజాబ్ లో కొంటున్నాం... ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి