టీఆర్ఎస్ మహా ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మాట్లాడారు. వరి పంట కొనుగోలు విషయంపై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు వంకర టింకరగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘తెలంగాణలో రైతులు పండించిన వడ్లు కొంటరా? కొనరా? సాఫ్ సీదా అడుగుతున్నం. మాకు దీనిపై స్పష్టత కావాలి. మేం మరాఠీలో అడినినమా? ఉర్దూలో అడిగామా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. గురువారం ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మా ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి మాట్లాడారు.
‘‘రైతుల సమస్య దేశం మొత్తం ఉంది. ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లోనే లక్షల మంది రైతులు కేంద్రంపై పోరాడుతున్నారు. లక్షల మంది రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీల ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. అడ్డగోలుగా మాట్లాడటం కాదు.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానంలో ఉంది. ఇంతకన్న సిగ్గుచేటు ఏమైనా ఉందా? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. బంగారు పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు’’ అని కేసీఆర్ మాట్లాడారు.
‘‘సమస్య ఉన్నదంతా కేంద్రం వద్దే. కేంద్రం మీద యుద్ధం ప్రారంభమైంది. మేం రాష్ట్రం తెచ్చుకుని, చెరువులను బాగు చేసుకుని, చెక్ డ్యాంలు కట్టి, కరెంట్ ఇచ్చి రైతులకు మేలు చేశాం. మంచిగా పంటలు పండించుకున్నం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానికే ఉంది. కానీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతుల జీవితాలపై చెలగాటమాడుతూ.. కార్లతో తొక్కి చంపుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విధ్వంసం రేపుతున్నారు. రైతులను బతకనిస్తారా? లేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దిక్కు మాలిన కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సండ్ర
టీఆర్ఎస్ పార్టీ మహాధర్నాలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులతో అలంకరణ చేసుకున్నారు. భుజంపై నాగలి పెట్టుకుని.. చొక్కా తరహాలో కంకులను వేసుకొని వేదికపై సందడి చేశారు. ఈ ధర్నాలో కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్లకార్డులు ప్రదర్శించారు.
Also Read: NIA Attacks : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ మూకుమ్మడి సోదాలు.. మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ !
Also Read: ఈ యుద్ధం ఆరంభమే.. అంతం కాదు, ఇక ఉప్పెనలాగా.. అవసరమైతే వాళ్లనీ కలుపుకుపోతాం: కేసీఆర్
Also Read: Robbery: కుక్కలు చనిపోవడం, దోపిడీ చేశాక చంపేయడం.. ఇది ఆ గ్యాంగు పనేనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి