అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దోపిడీ దొంగల బీభత్సం వెనక పార్థీ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున జనసంచారం ఉన్న సమయంలో కదిరి ఎన్జీవో కాలనీ లో ఇంట్లో ఉన్న ఉపాధ్యాయురాలు ఉషా దేవిని హత్య చేసి  జిల్లాలో కలకలం రేపారు. ఇంతటితో ఆగకుండా పక్కనే మరో ఇంట్లోకి చొరబడి శివమ్మ అనే మహిళను తలపై గాయాలు చేసి బంగారు దోచుకోవడం జిల్లా పోలీసులను షాక్ కు గురి చేసింది. ఈ తరహా దొంగతనాలు ఎప్పుడో ఒకసారి  అక్కడక్కడ జరుగుతుంటాయి. 


సాధారణంగా జరిగే దొంగతనాలు కు భిన్నంగా ప్రస్తుతం కదిరిలో  జరిగిన దోపిడీ ఉండడం వల్ల అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వైపుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ పక్కీరప్ప సంఘటనా స్థలానికి చేరుకుని దొంగలు సృష్టించిన బీభత్సాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు బృందాలను ఇప్పటికే పంపించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సేకరణ బృందాలను రంగంలోకి దింపి కొన్ని సాంకేతిక సాక్షాలను పోలీసులు ఇప్పటికే సంపాదించారు. 


మరోవైపు కదిరి పట్టణం పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సుమారు 15 పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి  అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయిస్తున్నట్లు ఎస్పీ పకీరప్ప వెల్లడించారు. సీసీటీవీ ల ఫుటేజీ సేకరణకు ఒక టీం, కదిరి పట్టణంలో లాడ్జిలో బసచేసిన ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల వివరాల సేకరణకు ఓ టీం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేసేందుకు రెండు టీంలు, చేతి వేలి ముద్రలను పోల్చడానికి ఒకటీం, ఇలా ఒక్కో దర్యాప్తులో ని ఒక్కో  కోణానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి  దర్యాప్తు ముమ్మరం  చేస్తున్నారు. 


సమయ పరిధి నిర్ధారించుకుని ప్రతిష్టాత్మకంగా ఈ కేసును ఛేదించేందుకు ఏ ఒక్క దారిని వదలకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో  కొంతమంది మహిళలు అనుమానాస్పదంగా తిరిగినట్లు స్థానికులు వెల్లడిస్తుండటాన్ని బట్టి చూస్తే పార్థీ గ్యాంగ్ పనేనని తెలుస్తోంది. ఈ గ్యాంగ్ మొదట మహిళల ద్వారా రెక్కీ నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తారు. అనంతరం ఆరుగురు సభ్యుల బృందం రంగంలోకి దిగుతుంది.  జన సమూహాలు ఉన్నప్పటికీ భయం లేకుండా ప్రణాళికను అమలు పరుస్తారు. పాశవికంగా ప్రవర్తించడం, కిరాతకంగా మొహం, తలపై గాయాలు చేయడం, డబ్బు, బంగారు దోచుకున్న తర్వాత దారుణంగా హతమార్చడం వీరు చేసే నేరాల  శైలి.
గతంలో జరిగిన కేసులను పరిశీలిస్తే ప్రస్తుతం కదిరి పట్టణంలో జరిగిన దోపిడి ఈ తరహా లోనిదే కావడంతో ఇది పార్థీ గ్యాంగ్ పనేనని అటు నేర పరిశోధకులు, ఇటు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా దొంగలు బీభత్సం సృష్టించిన కదిరి పట్టణంలోని ఎన్జీవో కాలనీ కు సమీపంలో అనుమానాస్పదంగా వీది కుక్కలు చనిపోవడం, కొంతమంది మహిళలు అనుమానాస్పదంగా సంచరించడంలాంటి విషయాలు అక్కడి పోలీసుల దృష్టికి రాకపోవడం, స్థానిక పోలీసుల నిఘా వైఫల్యంగా ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు.


దొంగల బీభత్సం సృష్టించిన అనంతరం స్థానికులు అరుపులు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. వెంటనే పోలీసులు స్పందించి ఉంటే కదిరి పట్టణం దాటిపోకుండా దొంగలను కట్టడి చేయగలిగేవారు.  ఈ పార్థీ గ్యాంగ్ మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా పని చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అక్కడికి తమ బృందాలను పంపి దర్యాప్తు వేగవంతం చేశాయి.


Also Read: Balka Suman: ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై దుష్ప్రచారం... నలుగురు వ్యక్తులు అరెస్టు.. పరారీలో ముగ్గురు యువకులు


Also Read: Hyderabad Crime: టాయిలెట్‌కు వెళ్తే కాపీ కొట్టినట్టేనా? బాలిక బట్టలు విప్పించిన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌